logo

శిక్షణ.. భవితకు రక్షణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటా నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గుతూ వస్తోంది. ప్రైవేటులో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలకు పదును పెడుతున్నారు. సర్కారు కళాశాలల్లోనూ ఇదే తరహా ప్రణాళిక అమలు చేసేలా తాజాగా ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Oct 2022 03:41 IST

విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ 

తాజాగా ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటా నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గుతూ వస్తోంది. ప్రైవేటులో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలకు పదును పెడుతున్నారు. సర్కారు కళాశాలల్లోనూ ఇదే తరహా ప్రణాళిక అమలు చేసేలా తాజాగా ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని సూచించింది. విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించనున్నారు.

చదువు.. పనులు
ఉమ్మడి జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 16 ఆదర్శ పాఠశాలలు, 10 కేజీబీవీ కళాశాల ద్వారా విద్యాబోధన కొనసాగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 9,870 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ పేదరిక కుటుంబ నేపథ్యం ఉన్నవారే. చదువుతోపాటు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. కొంత మంది తాత్కాలిక ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చదువులపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో వార్షిక పరీక్షల్లో అనుత్తీర్ణులవుతున్నారు. ఈ విషయాలను అధ్యయనం చేసిన సర్కారు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

ప్రతి వారం పరీక్షలు
ఇకపై ప్రతి వారం పరీక్షలు నిర్వహించి ఆయా మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టనున్నారు. తద్వారా కఠిన పాఠ్యాంశాలపై పట్టు సాధించి మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

ఎంసెట్‌,  నీట్‌కు శిక్షణ
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు అతికష్టమ్మీద ఇంటర్‌లో ఉత్తీర్ణులవుతున్నారు. ఇక ఎంసెట్‌, నీట్‌పై అసలే దృష్టిపెట్టడం లేదు. ప్రైవేటులో ప్రత్యేక శిక్షణ ఇస్తుండటంతో మెరుగైన ర్యాంకులు వస్తున్నాయి. ఇక నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రారంభం నుంచే శిక్షణ ఇవ్వనున్నారు. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం
- షేక్‌ సలాం, ఇంటర్‌ నోడల్‌ జిల్లా అధికారి

ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి వారం పరీక్షలు నిర్వహించనున్నాం. ప్రతి అంశంపై పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వనున్నాం. ఎంసెట్‌, నీట్‌కి సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాణించేలా
ప్రోత్సహించనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని