logo

దశమ విజయాలు

విజయదశమి అనగానే.. ప్రతిఒక్కరు తమ ఇబ్బందులు తొలగి సౌకర్యాలు చేకూరాలని అమ్మవారిని కొలుస్తారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఉభయ జిల్లాల్లో ఏడాది కాలంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే పది అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.

Published : 05 Oct 2022 03:37 IST

వసతుల కల్పనలో ఉమ్మడి జిల్లా పురోగతి
నేడు దసరా ఉత్సవాలు
ఈనాడు, నిజామాబాద్‌

విజయదశమి అనగానే.. ప్రతిఒక్కరు తమ ఇబ్బందులు తొలగి సౌకర్యాలు చేకూరాలని అమ్మవారిని కొలుస్తారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఉభయ జిల్లాల్లో ఏడాది కాలంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే పది అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే దసరా రోజున ఆయా విశేషాలపై ప్రత్యేక కథనం.


పల్లెప్రగతిలో దూకుడు

1. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాల నిర్వహణలో నిజామాబాద్‌ జిల్లా దేశంలోనే గుర్తింపు పొందింది. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2022లో జాతీయ స్థాయిలో మూడు, దక్షిణాదిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజనలోనూ నాలుగు పంచాయతీలు చోటు సాధించాయి. కామారెడ్డి జిల్లా 14వ స్థానంలో నిలిచింది.


సాగునీటి కష్టాలు అధిగమిస్తూ..

2. వర్ని మండలం సిద్ధాపూర్‌ వద్ద మూడు చెరువులను కలిపి రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. 30 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని రూ.106 కోట్ల నిధులతో చేపడుతున్నారు. ఈ పనులు ప్రారంభమయ్యాయి. చందూర్‌, జాకోరా వద్ద రూ.100 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా 15 వేల ఎకరాలకు నీరందనుంది.


పాలనా భవనాలు కొత్తగా

3. కామారెడ్డి, నిజామాబాద్‌కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రభుత్వ శాఖలు వేర్వేరు చోట్ల అద్దె భవనాల్లో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఒకేచోటకు రావడంతో అన్ని సేవలు అక్కడే లభిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఉభయ జిల్లాల్లో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేశారు.


హరితహారం.. పచ్చని తోరణం

4. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో రెండు జిల్లాల యంత్రా ంగం చురుగ్గా పాల్గొంటున్నాయి. సర్కారు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి.


రికార్డు స్థాయిలో వరి సాగు..

5. ఐదేళ్ల క్రితం ఉభయ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ప్రస్తుతం ఒక్క ఇందూరులోనే 4 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. కామారెడ్డిలో మరో 3 లక్షల ఎకరాల్లో ఇదే పంట వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 600 వరకు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.


భూమి చిక్కులు తొలగించి..

6. ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా 22-ఏలో చేర్చే క్రమంలో కొన్ని పట్టాభూములు అందులో నమోదయ్యాయి. క్షేత్రస్థాయి సర్వే నివేదికల ఆధారంగా పాలనాధికారులు మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లి సమీక్షించి వీలైనన్ని పరిష్కరించారు. కామారెడ్డిలో 24,088 ఖాతాలకు సమస్య ఉండగా 14,683.. నిజామాబాద్‌లో 30 వేలకు గాను 8312 మంది సమస్య పరిష్కరించారు.


రక్తహీనతను జయిస్తూ..

7. కామారెడ్డిలోని చిన్నారుల్లో రక్తహీనత అధికంగా ఉంది. ఈ సమస్య ఎదుర్కొంటున్న 12,897 మంది బాలలను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల విలువైన ఆయుర్వేద మందులు సమకూర్చారు. కలెక్టర్ల ఖాతాల్లో ఉండే నిధులను ఇందుకోసం వెచ్చించారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య రెండు వేలకు తగ్గింది.


మెరుగైన వైద్యం

8. ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు మెరుగయ్యాయి. నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో మోకీలు శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డికి వైద్య కళాశాల మంజూరు కాగా బాన్సువాడలో నర్సింగ్‌ కళాశాల, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది.


వాణిజ్యానికి ఊతం..

9. సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా 161 జాతీయ రహదారి ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల మీదుగా వెళ్తోంది. రాష్ట్ర రాజధానితో పాటు మహారాష్ట్రతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.


కొత్త బల్దియాలకు బృహత్‌ ప్రణాళికలు

10. మున్సిపాలిటీల్లో బృహత్‌ ప్రణాళికల అమలుకు ముందడుగు పడింది. కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ పట్టణాల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాత వాటిల్లో పెరిగిన జనాభాకు తగ్గట్లు సౌకర్యాలు మెరుగుపర్చనున్నారు. ఆయా చోట్ల ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని