logo

నిధులకు మించి ప్రతిపాదనలు

ఆస్తి మూరెడు... ఆశ బారెడు అన్న చందంగా మారింది బల్దియాల్లో పరిస్థితి. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు వస్తాయన్న ఆశతో భారీస్థాయిలో పనులు ప్రతిపాదించి.. ఇప్పుడు చేసిన వాటికి బిల్లులు చెల్లించలేక పురపాలికలు చతికిలపడుతున్నాయి.

Updated : 07 Oct 2022 04:54 IST

బిల్లులు రాక నిలిచిన పనులు

బల్దియాల్లో కుంటుపడుతున్న ప్రగతి

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

బోధన్‌లో పట్టణ ప్రగతిలో నిర్మిస్తున్న వైకుంఠధామం

ఆస్తి మూరెడు... ఆశ బారెడు అన్న చందంగా మారింది బల్దియాల్లో పరిస్థితి. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు వస్తాయన్న ఆశతో భారీస్థాయిలో పనులు ప్రతిపాదించి.. ఇప్పుడు చేసిన వాటికి బిల్లులు చెల్లించలేక పురపాలికలు చతికిలపడుతున్నాయి.

బోధన్‌లోని పలు కాలనీల్లో ప్రతిపాదిత పనులు కాకపోవడంతో కౌన్సిలర్లలో అసంతృప్తి పెరిగిపోయి అధికారులను నిలదీశారు. ఇదే సమస్యతో బల్దియా సమావేశం వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దుస్థితి అన్ని పురపాలికల్లో ఉండటం గమనార్హం.

స్థానిక ఆదాయ వనరులు బల్దియాల నిర్వహణకే సరిపోవడంలేదు. పొరుగుసేవల సిబ్బందికి ఒక్కోసారి రెండు నెలల వరకు వేతనాలు చెల్లించలేకపోతున్నారు. పల్లెల విలీనం, విస్తరిస్తున్న కాలనీలతో నీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటుతో విద్యుత్తు వినియోగం పెరిగింది. ఈ బిల్లులు చెల్లించడానికి తడబడుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థకు పనిభారం పెరిగింది. ఇది నిధుల వ్యయంపైనా ప్రభావం చూపిస్తోంది. పట్టణ ప్రగతి నిధులు కాస్త ఉపశమనం కలిగించిందనుకుంటే వాటాలో కోత సమస్యగా మారింది. 

ముందుకు రాని గుత్తేదారులు

ప్రభుత్వం 2020లో మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లకముందు కొత్త పురపాలక చట్టం-2019 ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా ప్రతినెల పట్టణ ప్రగతి పేరుతో నిధులు కేటాయించాలి. అలా ప్రతి మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను కలిపి జనాభా ప్రాతిపదికన మంజూరు చేస్తోంది. ఇవి తొలి ఏడాదితో పోలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర వాటాలు తగ్గుతుండటంతో ప్రగతిపై ప్రభావం పడుతోంది. చేసిన పనులకు బిల్లులు రాక గుత్తేదారులు కొత్తవి చేయడానికి ముందుకు రావడంలేదు. 

బోధన్‌ బల్దియా : నెలకు రూ.72 లక్షల చొప్పున కొద్ది నెలలు వచ్చాయి. ఆ తర్వాత రూ.55 లక్షలు, రూ.46 లక్షలు.. ఇలా నిధుల మంజూరు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మేలో రాష్ట్ర, కేంద్ర వాటాలు కలిపి రూ.54 లక్షల చొప్పున వచ్చాయి. జూన్, జులైలో రూ.28 లక్షల రాష్ట్ర వాటా మాత్రమే విడుదలైంది. కేంద్రం నుంచి రాలేదు. వచ్చిన వాటిల్లో నుంచి విద్యుత్తు బిల్లులే రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. నిధులపై ఆశతో పాలకవర్గ సభ్యులు రెండున్నరేళ్లలో దాదాపుగా రూ.12 కోట్లకు పైగా పనులకు ప్రతిపాతించారు. వాటిలో సగానికి పైగా టెండర్లు నిర్వహించగా.. రూ.4 కోట్ల వరకు పూర్తయ్యాయి. రెండు నెలలుగా కొత్త ప్రతిపాదనలు నిలిపివేశారు. పాతబకాయిలు వచ్చే వరకు కొత్తవి చేయబోమని గుత్తేదారులు స్పష్టం చేశారు.

కామారెడ్డి : ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, జులైలో రూ.56 లక్షల చొప్పున విడుదలయ్యాయి. మొత్తం రూ.11.20 కోట్ల పనులు చేపట్టారు. ఇంకా గుత్తేదారులకు రూ.5.20 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఆర్మూర్‌ : గతంలో నెలకు రూ.29 లక్షలు వచ్చేవి. ఇప్పుడు రూ.23 లక్షలు వస్తున్నాయి. వీటిలో రూ.15 లక్షలు విద్యుత్తు బిల్లులకే చెల్లిస్తున్నారు. మిగతావి హరితహారం, పారిశుద్ధ్యానికి ఖర్చు చేస్తున్నారు. ప్రగతి పనులకు నిధుల లేమి ఏర్పడుతోంది.

నిజామాబాద్‌ : నగర పాలక సంస్థకు ప్రతినెల రూ.1.50 కోట్లు వచ్చేవి. రెండు నెలల కిందట రూ.1.10 కోట్లు వచ్చాయి. చెల్లించాల్సిన బకాయిలేవీ లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి.

* భీమ్‌గల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ నిధుల్లో కోత అభివృద్ధి పనులపై ప్రభావం చూపిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని