logo

మళ్లీ మోగిద్దామా నీటి గంట

మార్కులే లక్ష్యమైన విద్యా వ్యవస్థలో తీవ్రమైన జబ్బు చేసే దాకా విద్యార్థుల ఆరోగ్యస్థితిని సమీక్షించే పరిస్థితి లేదు.

Published : 24 Nov 2022 05:25 IST

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌: మార్కులే లక్ష్యమైన విద్యా వ్యవస్థలో తీవ్రమైన జబ్బు చేసే దాకా విద్యార్థుల ఆరోగ్యస్థితిని సమీక్షించే పరిస్థితి లేదు. తల, కడుపు నొప్పి, నీరసం వంటి ప్రాథమిక లక్షణాలు  గుర్తించి.. సరిపడా నీరు తీసుకోవడంలేదని హెచ్చరిస్తున్నా అవగాహనా రాహిత్యంతో తేలిగ్గా తీసుకుంటున్నారు. మరీ ఎక్కువ జబ్బు చేస్తే.. నీళ్లు బాగా తాగించాలని వైద్యులు చెప్పే వరకు కళ్లు తెరవడంలేదు. ఈదశ దాటితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనారోగ్యంతో వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడుతోంది. నివారణకు ఏకైకమార్గం నీటి గంట.

సగమే తీసుకుంటున్నారు

ఉమ్మడి జిల్లాలోనూ 2019లో మన విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో వాటర్‌బెల్‌ అమలు చేశారు. కొవిడ్‌ తరువాత బడులు పునప్రారంభమైనా చాలా రోజులు భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత వంటి నియమాలతో దీనిపై ఎవరూ పెద్దగా స్పందించ లేదు. బడివేళల్లోనే సుమారుగా 1.5 లీటర్ల నీరు తీసుకుంటే మేలన్నది నిపుణుల మాట. 3-4.. లీటర్లు వయసును బట్టి తాగాల్సి ఉండగా... 1.5 లీటర్లే తాగుతున్నారని వైద్యుల అధ్యయనంలో తేలింది.

శీతాకాలంలోనూ అవసరమే

శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి, ఆహారం జీర్ణానికి ఎక్కువ నీటి వినియోగం.. వంటివాటితో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో సరిపడా నీరు తీసుకోవాలన్నది వైద్యుల సూచన.

ఇలా చేయాలి

విద్యార్థులు వెంట నీళ్ల సీసా తెచ్చుకునేలా చూడాలి. బడుల్లో సరిపడా శుద్ధనీటి నిల్వలు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో అవసరమైతే దాతలు నీళ్ల సీసాలు సమకూర్చితే ప్రయోజనం.

పరిమితంతో సమస్యలు

శరీరంలోని అన్ని అవయవాలు సమర్థంగా పనిచేయాలంటే తగిన మోతాదులో నీరు అవసరం. రక్తం పల్చగా ఉండి ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. మోతాదు తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, అపెండిక్స్‌, జ్వరం, మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, అసిడిటీ, మలబద్దకం, మూర్చ, కాలేయ.. చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి.
‘‘ఫస్ట్‌ బెల్‌, సెకండ్‌ బెల్‌, ఇంటర్‌వెల్‌.. ఇంటి బెల్‌’’ ఇదీ విద్యార్థుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బడి గంటలు. 2019లో కొద్ది రోజులు పరిచయమైన నీటి గంటను అంతా మరిచిపోయారు. ఇటీవల కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్‌ దీన్ని పునఃప్రారంభించాలనే ప్రకటనతో మళ్లీ తెరమీదకొచ్చింది. విద్యార్థులు తగిన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని కేరళ దీన్ని తొలిసారిగా పరిచయం చేసింది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన కొద్ది నెలలకే కొవిడ్‌ లాక్‌డౌన్‌తో మూలన పడింది.’’

ప్రధాన కారణాలు ఇవే..

ఎక్కువసార్లు మూత్రం పోవాల్సి వస్తుందని, టీచర్ల భయంతో విద్యార్థులు నీటిని సరిగా తీసుకోవడం లేదు. ఫలితంగా మూత్రంలోని విష లవణాలు శరీరంలోకి తిరిగి చేరుకుని వ్యాధులకు కారణమవుతాయి.

రెండు గంటలకోసారి తాగాలి

- డాక్టర్‌ శివశంకర్‌, సూపరింటెండెంట్‌, బోధన్‌ జిల్లా ఆస్పత్రి

రెండు గంటలకోసారి 200-250 మి.లీటర్ల నీరు తాగడం మంచిది. అప్పుడే శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. తగినంత నీళ్లు తీసుకోవడం, విసర్జించడం ముఖ్యమనే అవగాహన విద్యార్థుల్లో పెంచాలి.

కేరళలో నిర్ణయించిన ఈ వేళలనే అందరూ అనుసరించారు

*  మొదటిసారి నీటి గంట : ఉ।। 10:35
* రెండోసారి : మధ్యాహ్నం 12.00
* మూడోసారి : మధ్యాహ్నం 2.00

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని