logo

ఆటల కేంద్రం ఆర్మూర్‌

క్రీడల పరంగా ఆర్మూర్‌ ప్రత్యేకతను చాటుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి వసతులు, రవాణా సౌకర్యాలు, వ్యాయామ ఉపాధ్యాయుల ఆసక్తి, దాతల సహకారంతో పట్టణంలోని మైదానాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

Published : 25 Nov 2022 03:32 IST

రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల నిర్వహణ
న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పట్టణం

సాఫ్ట్‌బాల్‌ ఆడుతున్న జాతీయస్థాయి క్రీడాకారుడు వినీష్‌ (దాచిన చిత్రం)

క్రీడల పరంగా ఆర్మూర్‌ ప్రత్యేకతను చాటుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి వసతులు, రవాణా సౌకర్యాలు, వ్యాయామ ఉపాధ్యాయుల ఆసక్తి, దాతల సహకారంతో పట్టణంలోని మైదానాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఎక్కువగా సాఫ్ట్‌బాల్‌.. ఆర్మూర్‌లోని మినీ స్టేడియం, బాలుర పాఠశాల, గురుకులం మైదానాలు క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదికలవుతున్నాయి. జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2014 నుంచి ఇప్పటివరకు 20 రాష్ట్ర, 4 జాతీయస్థాయి పోటీలు ఇక్కడ జరిగాయి. ఉభయ జిల్లాలకు చెందిన 600 మంది క్రీడాకారులు జాతీయ, ఐదుగురు అంతర్జాతీయ స్థాయిలో రాణించినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఒక్కో టోర్నీకి 250 మంది..  జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో 2015 నుంచి ఒక జాతీయ, ఐదు రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్రీడలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటుంటారు. హాకీ టోర్నీకి ఆయా ప్రాంతాల నుంచి 250 మందికి పైగా హాజరవుతుంటారు. ఈ లెక్కన 1,250 మంది వరకు ఇక్కడ జరిగిన హాకీ పోటీల్లో భాగస్వాములయ్యారని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

గురుకులాలు.. ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్‌, రాష్ట్రస్థాయి పోటీలు పట్టణంలోని బాలుర గురుకులం మైదానంలో జరిగాయి. 1,200 మంది పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఇండోర్‌పై దృష్టి పెట్టాలె.. ఆర్మూర్‌లో మినీ, ఇండోర్‌ స్టేడియాలున్నాయి. ప్రస్తుతానికి మినీలోనే అన్ని రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇండోర్‌ పోటీలు జరగడం లేదు. సాఫ్ట్‌బాల్‌, హాకీ, క్రికెట్‌, అథ్లెటిక్స్‌, సాఫ్ట్‌బాల్‌ క్రికెట్‌, వాలీబాల్‌ తదితర పోటీల్లో ఇక్కడి క్రీడాకారులు రాణిస్తున్నారు.


క్రీడా కమిటీ వేయాలి

- రమణ, హాకీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆర్మూర్‌ కేంద్రంగా అనేక క్రీడలు జరుగుతున్నాయి. ఇక్కడివారు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. హాకీ క్రీడాకారులకు ఆర్మూర్‌ అడ్డాగా ఉంది. ఇప్పటికే వందల మంది సత్తా చాటారు. ఒక క్రీడా కమిటీని ఏర్పాటు చేసి మినీ, ఇండోర్‌ స్టేడియాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది.


జాతీయ స్థాయిలో ప్రతిభ

- గంగామోహన్‌, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

సాఫ్ట్‌బాల్‌లో ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ క్రీడాకారులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇక్కడున్న అనువైన స్థలం, దాతల సహకారంతో పోటీల నిర్వహణ సాధ్యమవుతోంది. నిజామాబాద్‌ జిల్లా జట్లు అన్ని విభాగాల్లో పతకాలు సాధిస్తున్నాయి. ఈ నెలలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. ఇందులో ఆర్మూర్‌లో చదువుతున్న వినీష్‌ ఒకరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని