logo

మహిళల కల.. భవిష్యత్తు కళకళ

గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(జాతీయ జీవనోపాధుల మిషన్‌) మార్గనిర్దేశంలో ‘విజన్‌ బిల్డింగ్‌(లక్ష్య నిర్దేశం)’ అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ రవీందర్‌రావు అన్నారు.

Published : 26 Nov 2022 05:03 IST

‘విజన్‌ బిల్డింగ్‌’ రూపకల్పనలో దేశంలోనే జిల్లా ప్రథమస్థానం
సెర్ప్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రవీందర్‌రావు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(జాతీయ జీవనోపాధుల మిషన్‌) మార్గనిర్దేశంలో ‘విజన్‌ బిల్డింగ్‌(లక్ష్య నిర్దేశం)’ అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ రవీందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదర్శ మండల సమాఖ్యల శిక్షణ తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనతో శుక్రవారం ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా సెర్ప్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు విజన్‌ బిల్డింగ్‌ ఉద్దేశాలను వివరించారు.

వృద్ధుల సంఘాల ఏర్పాటుకు కసరత్తు

సెర్ప్‌ ఆధ్వర్యంలో ఒక్కో గ్రామంలో పది వృద్ధుల సంఘాల ఏర్పాటుకు ప్రణాళికలు చేశాం. రాష్ట్రంలోని మహిళా రైతులకు చేయూతనిచ్చేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని నాలుగు మండలాల్లో వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలు నెలకొల్పాం.  

రుణాల సద్వినియోగంతోనే విజయం

స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తోంది. వాటిని వినియోగించుకుని వారితోపాటు పలువురికి ఉపాధి కల్పించాలనేదే సెర్ప్‌ లక్ష్యం.


మూడు విభాగాల్లో..

స్వశక్తి సంఘంలోని ప్రతి సభ్యురాలు సొంత లక్ష్యంతోపాటు కుటుంబ, సమాజ కలలను వెల్లడించారు. స్వయం సమృద్ధి సాధించేలా వివిధ వ్యాపార ఆలోచనలను తెలిపారు. కుటుంబ కల విభాగంలో చాలామంది పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పెట్టుకున్నారు. సమాజ విషయంలో స్ఫూర్తిదాయక ఆలోచనలు చేశారు. ఒక సంఘం వారు తమ మండలంలో గోదాం నిర్మిస్తామని తెలిపారు. దీని ద్వారా రైతులకు దూరం, వ్యయం తగ్గడంతోపాటు తమకూ ఆదాయం వస్తుందన్నారు. మరో బృందం గర్భిణులు, పిల్లల్లో రక్తహీనత నివారిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం అంగన్‌వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు తమ ఆదాయంలో కొంత అందిస్తామని ముందుకొచ్చారు. వీటిపై డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వారి సమక్షంలో ఒక్కో గ్రామ సంఘం తమ ఆలోచన వెల్లడిస్తాయి.  


ప్రణాళికల రూపకల్పన

ఎన్‌ఆర్‌ఎల్‌ఎం దిశానిర్దేశంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజన్‌ బిల్డింగ్‌ కార్యక్రమం అమలు చేస్తున్నారు. తెలంగాణలో సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో మొదటి విడతలో ఒక్కో జిల్లాకు మూడు నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేసి ఆయా స్వశక్తి సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి బీడీపీ(వ్యాపార ప్రణాళిక), వీఏపీ(వార్షిక ప్రణాళిక)లను సిద్ధం చేస్తున్నాం. వీటి రూపకల్పనలో దేశంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.


పేదరిక నిర్మూలనే ముఖ్యోద్దేశం

ప్రణాళికా లోపంతో స్వశక్తి మహిళల్లో ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటోంది. దీనికి తోడు సమాజాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. వీటిని పరిష్కరించే సంకల్పంతో విజన్‌ బిల్డింగ్‌ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తెలంగాణలో మొదటగా 112 మండలాల్లో ప్రారంభించాం. జిల్లాలోని భిక్కనూర్‌, దోమకొండ, బీబీపేట, కామారెడ్డి మండలాల్లో అమలు చేస్తున్నాం. దశల వారీగా అన్ని మండలాల్లో చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని