logo

ఇళ్ల నిర్మాణం.. నూతన విధానం

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గంపగుత్తగా కట్టేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో.. లబ్ధిదారులను సమూహాలుగా చేసి నిర్మిస్తున్నారు.

Published : 26 Nov 2022 05:03 IST

జిల్లాలో ఊపందుకున్న పథకం


బాన్సువాడ పట్టణంలో పూర్తయిన  రెండు పడక గదుల ఇళ్లు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గంపగుత్తగా కట్టేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో.. లబ్ధిదారులను సమూహాలుగా చేసి నిర్మిస్తున్నారు. మొదటగా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ విధానం చేపట్టగా.. తాజాగా ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోనూ ప్రారంభించారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం నిమ్తితం రూ.3 లక్షల అందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని కోసం జిల్లావ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.  

గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో

గిట్టుబాటు కావడం లేదనే ఉద్దేశంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులు ముందుకు రాలేదు. లబ్ధిదారులు మాత్రం తమకు ఎప్పుడు కట్టిస్తారని తరచూ ప్రశ్నించేవారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు గుత్తేదారులతో చర్చించి వారి ఆధ్వర్యంలో బిల్లుల చెల్లింపునకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఈ విధానం ద్వారా సుమారు 4 వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగు వేలు కొనసాగుతున్నాయి. దీనిని  ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు అందిపుచ్చుకున్నారు. కొందరు గుత్తేదారులు  మాత్రం  ప్రభుత్వం ఇస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇవ్వకుండా   తామే విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణులున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న తీరు

* బాన్సువాడతో పాటు జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

* స్థానిక ఎమ్మెల్యేల చొరవతో అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

* ఎలాగంటే.. పది నుంచి పదిహేను మంది లబ్ధిదారులు ఒక గుత్తేదారు ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తారు.

* అతని ఐడీ మీద ఎంబీ రూపొందించి చెల్లింపులు చేస్తారు.

* సదరు గుత్తేదారు ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో రూ.85 వేల నుంచి రూ.90 వేల చొప్పున చెక్కుల రూపంలో ఇస్తున్నారు.

* ఇలా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు
విడతల వారీగా కేటాయించినవి: 10,317
పరిపాలన అనుమతులు మంజూరైనవి : 10,263

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని