logo

సర్కారు బడుల్లో నియామకాలేవీ?

వీరు డిచ్‌పల్లితండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. 30 మందికి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఒక్కరే ఐదు తరగతులకు బోధించడంతోపాటు అన్ని నివేదికలు నిర్ణీత సమయంలో ఉన్నతాధికారులకు అందజేయాలి.

Published : 26 Nov 2022 05:03 IST

ఖాళీలతో కుంటు పడుతున్న బోధన
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

వీరు డిచ్‌పల్లితండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. 30 మందికి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఒక్కరే ఐదు తరగతులకు బోధించడంతోపాటు అన్ని నివేదికలు నిర్ణీత సమయంలో ఉన్నతాధికారులకు అందజేయాలి. అనారోగ్యంతో సెలవు తీసుకుంటే మండల రిసోర్స్‌ పర్సన్లతో నెట్టుకొస్తున్నారు.

లాంటి ఏకోపాధ్యాయ బడులు జిల్లాలో 126 ఉన్నాయి. అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఇద్దరు, ముగ్గురితో కొనసాగుతున్నాయి. ఏళ్ల తరబడి బోధనా సిబ్బంది నియామకాలు లేక ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో విద్యా వాలంటీర్లను నియమించేవారు. కొవిడ్‌ నేపథ్యంలో వారిని పక్కన పెట్టారు. తిరిగి పునరుద్ధరించడం లేదు. దీనికి తోడు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

తొలిమెట్టు  ఎలా..

ఓ వైపు తొలిమెట్టుతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో, మరో వైపు పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో పాటు పేరుకుపోయిన ఖాళీలతో ఈ కార్యక్రమం ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందోననే సందేహలు తలెత్తుతున్నాయి.

సబ్జెక్టు  బోధనలోనూ..

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధిస్తుండటం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతోంది. దీనికితోడు పర్యవేక్షక పోస్టులైన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల ఖాళీలు విద్యావ్యవస్థ లోపాలను స్పష్టం చేస్తున్నాయి.


పదోన్నతులు కల్పించాలి
- అంకం నరేశ్‌, ఎస్జీటీ

ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేక ఎస్జీటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకే క్యాడర్లో పదవీ విరమణ పొందాల్సిన దుస్థితి నెలకొంది. వెంటనే పదోన్నతులు కల్పించి, బదిలీ ప్రక్రియ చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని