logo

సన్నాలకే జై

మునుపెన్నడు లేనంతగా ఈసారి బహిరంగ విపణిలో వడ్లకు డిమాండ్‌ ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చే ప్రభుత్వ మద్దతు ధరను మించి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.

Published : 26 Nov 2022 05:03 IST

పోటీపడి కొంటున్న వ్యాపారులు
జైశ్రీరాం రకం క్వింటాకు రూ. 2600

న్యూస్‌టుడే, ఆర్మూర్‌  : మునుపెన్నడు లేనంతగా ఈసారి బహిరంగ విపణిలో వడ్లకు డిమాండ్‌ ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చే ప్రభుత్వ మద్దతు ధరను మించి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. మొదట్లో కల్లాల మీదే పచ్చి ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపిన వారు ఇప్పుడు సన్నాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఎగబడి కొంటున్నారు. ఇది వరకు మిర్యాలగూడ వ్యాపారులు రాగా, ఈసారి కర్ణాటక నుంచి వచ్చి రైతుల కల్లాల్లో వాలిపోతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కేవలం సగం సరకుతోనే సర్దిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏదీ దక్కనీయడం లేదు

కొనుగోలు కేంద్రాలకు సాధారణ రకంగా అమ్ముడయ్యే సన్నాలు ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు. ‘ఏ’ గ్రేడ్‌ క్వింటాకు రూ.2060 పలికే దొడ్డు రకాలే ఇచ్చేందుకు రైతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు హమాలీ రాకున్నా.. లారీ ఆలస్యమైనా బయట వ్యాపారులకే ధర కాస్త అటూఇటుగా అంటగడుతున్నారు. సర్కారు కేంద్రాల్లో హమాలీ ఛార్జీలు, తరుగు, తూకంలో మోసాలు ఎక్కువవడంతో క్వింటాకు రూ.150 వరకు నష్టపోతున్నామని రైతులు ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. చాలాచోట్ల మిల్లర్లే దళారులతో రంగంలోకి దిగి బేరమాడుతున్నారు. కేంద్రాల నుంచి వచ్చే వడ్లకు స్థలం లేదనే వారు కూడా ఇప్పుడు ఏదైనా పర్వాలేదని ఆలస్యం చేయకుండా ఆహ్వానిస్తున్నారు.

కర్ణాటక రాకతో..

మన వద్ద కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు రూ.2,060 ఉంటే సరిహద్దున ఉన్న కర్ణాటకలో రూ.2,450 పలుకుతోంది. ఉమ్మడి జిల్లాలో సరిహద్దు రైతులు పొరుగు రాష్ట్రంలోనే అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. రాయచూర్‌, గుర్మిట్‌, యాద్గిర్‌ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎలాంటి హమాలీ ఛార్జీలు, రవాణా ఖర్చులు లేకుండానే రూ. 200-400 అదనంగా చెల్లించి కొంటున్నారు. వరుసగా కురిసిన వర్షాలతో కర్ణాటక, తమిళనాడులో వరి పంట దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది ముందే గుర్తించిన మిర్యాలగూడ వ్యాపారులు బోధన్‌, ఎడపల్లి, రుద్రూర్‌, బీర్కూర్‌, రెంజల్‌, వర్ని, చందూర్‌, మోస్రా మండలాల నుంచి 80 శాతం కోతలైన వెంటనే పచ్చి పంట ఎగురేసుకుపోయారు.

సన్నాల సగటు రూ. 2,400

ప్రస్తుతం జైశ్రీరాందే హవా నడుస్తోంది. గరిష్ఠంగా క్వింటాకు రూ.2600, సగటు రూ.2400 అమ్ముడుపోతోంది. తర్వాతి స్థానం హెచ్‌ఎంటీది. రూ.2200 వరకు సగటు ధరతో కొంటున్నారు. బీపీటీ, గంగాకావేరి సన్నాలు రూ.2,100 తగ్గకుండా పలుకుతున్నాయి. ఏటా రెండో పంటకు దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇచ్చే రైతులు యాసంగిలో మాత్రం సన్నాలకే జై కొడుతున్నారు. రానున్న సీజన్లలోనూ మంచి ధర దక్కుతుందని భావిస్తున్నారు.


రోజురోజుకు పెరుగుదల

- వెంకటేశం, సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి, నిజామాబాద్‌ యార్డు

నిజామాబాద్‌ యార్డుకు తెచ్చే ధాన్యంలో తేమశాతం చూసుకుంటే చాలు గిట్టుబాటు వచ్చేస్తుంది. ఈ సారి సన్నాలకు మంచి డిమాండ్‌ ఉంది. వ్యాపారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని