logo

నిరాశ్రయులకు.. గూడు కరవు

పట్టణాల్లో నిరాశ్రయులకు నీడ చూపాల్సిన కార్యక్రమం నిరాదరణకు గురవుతోంది. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది.

Published : 27 Nov 2022 06:09 IST

షెల్టర్‌ ఫర్‌ హోమ్‌లెస్‌పై కొరవడిన దృష్టి

బోధన్‌లో ఫుట్‌పాత్‌పై నిరాశ్రయులు

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ నగరం: పట్టణాల్లో నిరాశ్రయులకు నీడ చూపాల్సిన కార్యక్రమం నిరాదరణకు గురవుతోంది. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది. సొంత గూడు లేని చాలా మంది రహదారులు, దుకాణాల వద్ద వణుకుతూ నిద్రిస్తూ ఉంటారు. వారికి స్థానిక సంస్థల ఆధ్వర్యంలో గూడు, వసతి కల్పించాలన్నది ‘షెల్టర్‌ ఫర్‌ హోమ్‌లెస్‌’ ముఖ్య ఉద్దేశం. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రోగుల సహాయకుల కేంద్రం కొనసాగుతుండగా.. బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారికి ఏడాదిగా సేవలందించడం లేదు. తాజాగా నగరంలో రెండు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌, బోధన్‌ పట్టణాల్లో  ఆ ఊసే లేదు.

ఇదీ నేపథ్యం..: పట్టణాలు, నగరాల్లో నిత్యం ఫుట్‌పాత్‌లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రుల పరిసరాల్లో నిరాశ్రయులు నిద్రిస్తున్నారు. ఇలాంటి వారు జనాభాలో ఒక శాతం ఉంటారని అంచనా. వీరికి ప్రభుత్వాలు తాత్కాలికంగా వసతి కల్పించాలని న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలున్నాయి. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన మార్గదర్శకాలు స్వరాష్ట్రంలోనూ అమలవుతున్నాయి. నిబంధనల మేరకు 50- 100 మందికి ఒక షెల్టర్‌, వ్యక్తికి 50 చదరపు అడుగుల స్థలం ఉండేలా వసతి కల్పించాలి. నిర్వహణ స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే మూడు షిఫ్టుల్లో కేర్‌టేకర్‌, ఒక మేనేజర్‌ పర్యవేక్షణలో తాగునీరు, పడకలు, రగ్గులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, సామాన్లు భద్రపరచుకునే ర్యాకులు వంటి సదుపాయాలు కల్పించాలి. భోజన వసతి ఉండదు. దాతలు ఇస్తే మాత్రం నిబంధనల మేరకు స్వీకరిస్తారు. ఆశ్రయం పొందుతున్న వారు వంట చేసుకుంటామంటే గ్యాస్‌ పొయ్యి సమకూరుస్తారు.

పాత ప్రభుత్వ భవనాల్లో..: లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో ఒక కేంద్రాన్ని (సొంత భవనం) ప్రభుత్వం నిర్మించాలి. వీటిని పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా శాశ్వత భవనం ఒక్కటీ నిర్మించలేదు. పాత ప్రభుత్వ భవనాల్లో కేంద్రాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. జిల్లాకు పొరుగున మహారాష్ట్రతో సరిహద్దు, రైళ్ల సదుపాయం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారిలో కొందరు రహదారులపై నిద్రిస్తున్నారు. నగరంతో పాటూ బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాల్లోనూ నిరాశ్రయులు ఉంటున్నారు. వారిలో కొందరు ఏ ఆధారం లేనివారు అయితే మరికొందరు కుటుంబ నిరాదరణకు గురైన వారు ఉన్నారు. ఇలాంటి వారిని కేంద్రాల్లో చేర్చి వారి వివరాలు సేకరిస్తారు. ఎవరికైనా ఆధార్‌ లేకుంటే కార్డు ఇప్పించడం, అర్హతలను బట్టి ప్రభుత్వ ఆహార భద్రత, ఆసరా పింఛన్‌ వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు. ఆరోగ్య శిబిరాలతో అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తారు. దీంతో వారందరూ ప్రభుత్వ పర్యవేక్షణలోకి వస్తారు.

జిల్లాలో  పరిస్థితి..

నిజామాబాద్‌ నగరంలో గతంలో నిర్వహించిన కేంద్రంలో 45- 50 మంది ఆశ్రయం పొందారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిగా కేంద్రం అందుబాటులో లేదు. తాజాగా నగరంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా 100 మంది ఉండేలా కేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదరడంతో త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జీజీహెచ్‌లో రోగుల సహాయకులకు 50 పడకలతో ఒక కేంద్రం నిర్వహిస్తుండగా నిత్యం 25 మంది ఉపయోగించుకుంటున్నారు.

* బోధన్‌ పట్టణంలో కార్యక్రమం ఆరంభించినప్పటి నుంచి సర్వే మాత్రమే నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల కిందట సర్వేలో 19 మంది ఉన్నట్లు గుర్తించారు. తక్కువ మంది ఉన్నారని కేంద్రం మంజూరు చేయలేదు. కానీ ఇప్పుడు పట్టణంలో 50 మందికి పైగానే నిరాశ్రయులు ఉంటారు. 

* ఆర్మూర్‌ పట్టణంలోనూ షెల్టర్‌ ఏర్పాటు  చేయలేదు. ఇక్కడా 50 మందికి పైగానే ఉండే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని