logo

సమృద్ధిగా జలం.. ఆయకట్టుకు ఫలం

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి.

Published : 27 Nov 2022 06:09 IST

యాసంగిలో పెరగనున్న వరిసాగు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన శివం కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిర్ధారించుకుని ఆయకట్టుకు విడుదల చేయాలని నిర్దేశించారు. యాసంగి సీజన్‌లో వానాకాలం మించి వరి సాగయ్యే అవకాశాలున్నాయి.


తొమ్మిది టీఎంసీలు

నిజాంసాగర్‌ జలాశయం నుంచి యాసంగి సీజన్‌కు తొమ్మిది టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలీసాగర్‌(డిస్ట్రిబ్యూటరీ-49) వరకు కాలువల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో 15 రోజులకోమారు విడుదల చేయనున్నారు. తదనంతరం పది రోజులకోమారు వదులుతారు. డిసెంబరు 20- 25 మధ్య నీటి విడుదల ప్రారంభించాలని నిర్ణయించారు.


ఈసారి రెండు జోన్లకు ...

నిబంధనల మేరకు ఈ ఏడాది ఏ- జోన్‌ పరిధిలోని ఆయకట్టుకు నీటి విడుదల లేనప్పటికీ ప్రాజెక్టు సమృద్ధిగా ఉండడంతో రెండు జోన్ల పరిధిలోని ఆయకట్టుకు పంపిణీ చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని 27 గొలుసుకట్టు చెరువుల్లోనూ సమృద్ధిగా నీరుంది.


మొదటిసారి రెండో పంటకు

కొన్నేళ్లుగా ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టు నిండలేదు. గతేడాది నిండినప్పటికీ యాసంగి ప్రారంభమయ్యే నాటికి సగం విడుదల చేశారు. యాసంగి మొత్తానికి సరఫరా కాలేదు. ఈ ఏడాది తొలిసారిగా మొత్తం ఆయకట్టు రెండో పంటకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట కాల్వలతో పాటు ప్రధాన కాలువ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు.

త్వరలో విడుదల చేస్తాం

శ్రీనివాస్‌, సీఈ, నీటిపారుదలశాఖ కామారెడ్డి

వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్‌ కేంద్రంలో జరగనున్న డీఐఏబీ సమావేశంలో సాగునీటి విడుదల ప్రణాళిక విడుదల చేస్తాం. ప్రాజెక్టుల్లో జలం సమృద్ధిగా ఉంది. రెండో పంటకు అవసరమైన మేర సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని