logo

పోడు.. తిరస్కరణల జోరు

జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాలకు అధిక శాతం అనర్హులే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.

Published : 30 Nov 2022 06:31 IST

దరఖాస్తుల్లో అనర్హులవే ఎక్కువ
నేటి నుంచి డివిజన్‌ స్థాయి సమావేశాలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాలకు అధిక శాతం అనర్హులే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. 27,075 మంది 68,505 ఎకరాలకు అర్జీలు పెట్టుకోగా.. 90శాతానికి పైగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. సాగులో లేని అటవీ భూములను దరఖాస్తులో చేర్చారు. దీనికి తోడు అటవీ హక్కుల చట్టం నిర్దేశించిన మేర అవసరమైన ధ్రువపత్రాలు జతపరచలేదు. గిరిజనేతరులైతే మూడు దశాబ్దాలుగా సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఈ మేరకు గ్రామసభల్లో తిరస్కరణకు గురయ్యాయి.

పూర్తయిన గ్రామసభలు

క్షేత్రపరిశీలన అనంతరం పోడు దరఖాస్తులపై సమగ్ర వివరాల సేకరణ నిమిత్తం వారం రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 354 ఆవాసాల్లో సభలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ వివరాల ఆధారంగా దరఖాస్తుల్లో తిరస్కరణ గురైనవి పోగా మిగిలిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

పునఃపరిశీలనకు అవకాశం

ఒకవేళ గ్రామసభలో దరఖాస్తులను తిరస్కరిస్తే 60 రోజుల్లోపు సదరు రైతులు ఆర్డీవో ఆధ్వర్యంలోని డివిజన్‌ స్థాయి కమిటీకి మళ్లీ విన్నవించుకునే వీలుంది. అక్కడా తిరస్కరిస్తే జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన కొనసాగే జిల్లా కమిటీకి అర్జీ పెట్టుకోవచ్చు. హక్కుపత్రాల జారీలో తుది నిర్ణయం జిల్లా కమిటీదే. కొత్తగా దరఖాస్తులకు అవకాశం లేదు.

ఆర్డీవో నేతృత్వంలో..

అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభల అనంతరం పోడు దరఖాస్తులను ఆర్డీవో నేతృత్వంలోని డివిజన్‌ స్థాయి కమిటీ సమావేశంలో పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లాలో మూడు డివిజన్లు ఉండగా మొదటగా బాన్సువాడ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజుకు 20 గ్రామాల దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం కామారెడ్డి, ఎల్లారెడ్డిలో చేపడతారు. వీటి అనంతరం హక్కుపత్రాల జారీకి అర్హత సాధించిన దరఖాస్తులను జిల్లా కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. కలెక్టర్‌ నేతృత్వంలో వాటిని ఆమోదించి అటవీ హక్కుపత్రాలు జారీ చేస్తారు.


354 ఆవాసాల్లో చేపట్టాం

- అంబాజీ, గిరిజన సంక్షేమాధికారి, కామారెడ్డి

పోడు దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అటవీ హక్కుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 354 ఆవాసాల్లో గ్రామసభలు నిర్వహించాం. ఇక డివిజన్‌ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నాం.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు