logo

నగరానికి నలు వైపులా..

‘నిజామాబాద్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల సౌకర్యార్థం నగరం నలు వైపులా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి’.. అని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Published : 03 Dec 2022 03:41 IST

మార్కెట్లకు ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

అహ్మదీబజార్‌లో కొనసాగుతున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు

‘నిజామాబాద్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల సౌకర్యార్థం నగరం నలు వైపులా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి’.. అని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు స్థలాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

* అహ్మదీబజార్‌లో.. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు జిల్లాకేంద్రానికి వచ్చి స్థిరపడుతున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లు లేవు. గతంలోనే నాలుగు ఏర్పాటు చేయాలని భావించినా.. బోధన్‌రోడ్డులోని అహ్మదీబజార్‌లో మాత్రమే సమీకృత మార్కెట్‌ నిర్మిస్తున్నారు. దీనికి రూ.4 కోట్లు వెచ్చిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తికావాల్సి ఉండగా మొదట్లో నెమ్మదిగా సాగాయి.

* పాత భవనాలు కూల్చివేత: నగరంలో కీలక ప్రాంతమైన ఖలీల్‌వాడీలోనూ మార్కెట్‌ అవసరం ఉందని అధికారులు గుర్తించారు. పాత తహసీల్‌ కార్యాలయం, దాని పక్కనే ఉన్న సర్వే ల్యాండ్‌ రికార్డు భవనం, ఆర్డీవో కార్యాలయాలను తొలగించి ఇక్కడ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత భవనాలను కూల్చివేశారు. రూ.4 కోట్లతో కూరగాయలు, మటన్‌, చికెన్‌, చేపల విక్రయాల కోసం 120 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం పాత డీఈఓ కార్యాలయ ఆవరణను కేటాయించారు.

* స్థలాల కోసం అన్వేషణ: హైదరాబాద్‌ రోడ్డులోని వినాయక్‌నగర్‌, ఆర్మూర్‌ మార్గంలోని గంగాస్థాన్‌, వర్ని రోడ్డు వైపు మూడు సమీకృత మార్కెట్ల కోసం స్థలాలు చూస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఉంటే.. వాటిని గుర్తించి అప్పగించాలని తహసీల్దార్లను ఆదేశించారు. గంగాస్థాన్‌, బోర్గాం(పి) వద్ద అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అర్బన్‌ ఎమ్మెల్యే నిరంతరం బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని