logo

ప్రణాళిక తికమక

నూతన పుర చట్టం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి పురపాలికకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణానికి 2040 సంవత్సరం నాటి అవసరాలు, జనాభా, పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ సిద్ధం చేసి ఇటీవల విడుదల చేసింది.

Published : 03 Dec 2022 03:41 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ప్రణాళిక విభాగంలో తమ అభ్యంతరాలు అందజేస్తున్న రైతులు

నూతన పుర చట్టం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి పురపాలికకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణానికి 2040 సంవత్సరం నాటి అవసరాలు, జనాభా, పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ సిద్ధం చేసి ఇటీవల విడుదల చేసింది.

కామారెడ్డి పురపాలికలో విలీనమైన శివారు గ్రామాల్లోని వ్యవసాయ భూముల గుండా రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించడంపై ఆయా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా.. పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను నివాస జోన్‌గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని.. 

సిరిసిల్ల రోడ్డులోని ఒక భవన సముదాయాన్ని వాణిజ్య..  కుడి, ఎడమల వైపు మల్టీ.. వెనుక వైపు పరిశ్రమల జోన్లుగా పేర్కొన్నారు. మల్టీజోన్లు, నివాస ప్రాంతాలను వాణిజ్య జోన్‌గా చూపిస్తే భవిష్యత్తులో అనుమతుల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

* టేక్రియాల్‌ చౌరస్తా నుంచి కొత్తబస్టాండ్‌ మీదుగా ఎన్‌హెచ్‌-44ను కలిపే పట్టణ ప్రధాన రహదారిలో వెడల్పులో వ్యత్యాసాలున్నాయి. ఒక ప్రాంతంలో 150 ఫీట్లుగా, మరోచోట 200 ఫీట్లుగా పేర్కొన్నారు. 

* గ్రామాల విలీనంతో సరిహద్దులు మారాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, బృహత్‌ ప్రణాళికలో చేర్చాల్సి ఉండగా.. అటువంటి కసరత్తు జరగలేదని తెలుస్తోంది.

* ఎన్‌హెచ్‌-44 పక్కన ఉన్న రెండు పడక గదుల ఇళ్ల సముదాయం సమీపంలోని ప్రాంతాన్ని పరిశ్రమల జోన్‌గా పేర్కొనడంపై అభ్యంతరాలు ఉన్నాయి.

* పట్టణంలోని నడిబొడ్డున ఉన్నటువంటి జన్మభూమి రోడ్డును 2012లోని మాస్టర్‌ప్లాన్‌లో 80 ఫీట్లుగా పేర్కొనగా.. ప్రస్తుతం 60 ఫీట్లకు కుదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అభిప్రాయ సేకరణ నామమాత్రమే..

బృహత్తర ప్రణాళిక రూపొందించే ముందు పట్టణంలోని అన్ని ప్రాంతాల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉండగా.. అలాంటి కసరత్తు జరగలేదని తెలుస్తోంది. కేవలం కొందరు కౌన్సిలర్లతోపాటు ప్రైవేటు ప్లానర్లతో మాత్రమే ఏజెన్సీ ప్రతినిధులు చర్చించినట్లు సమాచారం. విలీన గ్రామాల ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.

అవగాహన కొరవడి..

బల్దియా అధికారులు వారం రోజుల కిందటే బృహత్తర ప్రణాళిక నమూనాలను పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పెట్టగా.. తమకు ఒనగూరే ప్రయోజనాలపై ప్రజలు చర్చిస్తున్నారు. అభ్యంతరాలు నమోదు చేసేందుకు 2023 జనవరి 11 వరకు గడువు ఉండగా.. ఇప్పటికే 48 మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. మరికొందరికి ఎలా వ్యక్తపర్చాలో తెలియక ముందుకు రాని పరిస్థితి ఉంది.


పరిష్కరించాకే అమలు
- గిరిధర్‌, పట్టణ ప్రణాళిక విభాగం, కామారెడ్డి

బృహత్‌ ప్రణాళికపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. వాటిని పరిష్కరించాకే    అమలుపై దృష్టి సారిస్తాం. ప్రజలు బల్దియాలోని సిటిజన్‌ చార్ట్‌లో అభ్యంతరాలను నమోదు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని