logo

జల్సాలకు అలవాటు పడి.. బైక్‌లు ఎత్తుకెళ్లి..

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలించే ముఠాను అరెస్టు చేసినట్లు భీమ్‌గల్‌ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ ఠాణాలో శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Published : 04 Dec 2022 04:02 IST

పట్టుబడిన నిందితులతో భీమ్‌గల్‌ సీఐ వెంకటేశ్వర్లు

మోర్తాడ్‌, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలించే ముఠాను అరెస్టు చేసినట్లు భీమ్‌గల్‌ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ ఠాణాలో శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కట్ట నాగరాజు, కొత్తకోట మల్లి, దేవరకొండ శివ, బండి సుకేందర్‌ 2021లో నిజామాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన నాగేశ్వరరావు వద్ద తాపీపని చేసేందుకు వచ్చారు. వచ్చిన డబ్బులు మద్యం తాగేందుకు, ఇతర జల్సాలకు సరిపోవడం లేదని ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. మూడు నెలలుగా నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌, కామారెడ్డి జిల్లా రామారెడ్డి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఠాణాల పరిధిలో దొంగిలించిన ద్విచక్ర వాహనాలను సిరికొండలోని యాదవ సంఘం వెనుకాల చెట్ల పొదల్లో దాచిపెట్టారు. వారి నుంచి రూ.1.30 లక్షల విలువ చేసే ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మోర్తాడ్‌ ఠాణా పరిధిలోనూ శనివారం ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లేందుకు వస్తుండగా తక్కరివాడ వద్ద పట్టుకున్నారు. సీఐ వెంటేశ్వర్లు, మోర్తాడ్‌ ఎస్సై ముత్యంరాజ్‌, ఏఎస్సై గోపాల్‌, రైటర్‌ నారాయణ, కానిస్టేబుళ్లు నర్సయ్య, వసంత్‌ను ఏసీపీ ప్రభాకర్‌ అభినందించారు.

సైబర్‌ మోసం.. రూ.95 వేలు లూటీ

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అంతర్జాల తరగతుల కోసం తీసుకున్న అడ్మిషన్‌ను రద్దు చేసుకోవాలని చూసిన ఓ వ్యక్తి ఖాతాలోంచి సైబర్‌ నేరగాళ్లు రూ.95 వేలు లూటీ చేసిన ఘటన జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరేష్‌ తెలిపిన ప్రకారం.. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తరగతుల రద్దుకు అంతర్జాలంలో కాల్‌ససెంటర్‌ నంబరు వెతికారు. అలా దొరికిన ఓ నంబరుకు వివరాలను నిక్షిప్తం చేశారు. అనంతరం వచ్చిన ఓ లింక్‌ను క్లిక్‌ చేసి యూపీఐ నంబరు చెప్పగానే ఖాతాలోని నగదు బదిలీ అయింది. ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని