logo

ఐదు నెలలైనా పొత్తాలు ఇవ్వలే!

విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాల పంపిణీ జరగలేదు.

Published : 04 Dec 2022 04:02 IST

బడుల్లో పాఠ్యాంశాల బోధనకు అవరోధాలు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

జిల్లాకు వచ్చిన పుస్తకాలను నిల్వ చేస్తున్న సిబ్బంది

విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాల పంపిణీ జరగలేదు. ఈసారి ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, అధిక సంఖ్యలో ముద్రించాల్సి ఉండటంతో ఆలస్యం అవుతోంది. ఫలితంగా బోధనకు అవరోధాలు తప్పడం లేదు.

జూన్‌లో బడులు ప్రారంభం కాగా జులైలో ఎఫ్‌ఏ-1 పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అరకొర పుస్తకాలనే విద్యార్థులకు పంపిణీ చేశారు. అందనివారు గత విద్యా సంవత్సరం వారివి తీసుకుని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్టోబరు, నవంబరులో 50 వేల పుస్తకాలు వచ్చినా సరిపోలేదు. ఏడో తరగతిలో సామాన్య, 8లో జీవశాస్త్రం, 9 లో ఆంగ్లం, 10లో తెలుగు పుస్తకాలు సరిపడా రాలేదు.

పాఠ్యప్రణాళికపై ప్రభావం

నిర్దిష్ట ప్రణాళిక మేరకు బోధన సాగాల్సి ఉన్నా వివిధ కారణాల రీత్యా పాఠ్యాంశాలు పూర్తిగా చెప్పలేదు. ఆగస్టులో పక్షం రోజుల పాటు వజ్రోత్సవాలు, దసరాకు 15 రోజులు, అధిక వర్షాల కారణంగా ఏడు రోజులు సెలవులు వచ్చాయి. పదో తరగతి విద్యార్థులకు బడులు ప్రారంభమై ఐదు మాసాలవుతున్నా పాఠ్యప్రణాళిక 53 శాతమే పూర్తయింది.


సరఫరా ఆధారంగా పంపిణీ
- రాజు, డీఈవో-కామారెడ్డి

జిల్లాకు వచ్చే పుస్తకాల సరఫరా ఆధారంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాం. అందరికీ సమకూరేలా చర్యలు చేపడతాం. తరగతుల్లో వెనుకబడిన పిల్లలను గుర్తించి మొదట వారికి ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ఈ నెలలో శతశాతం పంపిణీ పూర్తవుతుందని భావిస్తున్నాం.

బడులు 1,011
కావాల్సిన పుస్తకాలు (లక్షల్లో) 8.60
వచ్చింది (లక్షల్లో) 7.20

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని