logo

సెల్‌ టవర్‌పై ఉరేసుకొని రైతు ఆత్మహత్య

తన పొలం గుండా కాలువ నీటిని తీసుకెళ్తే నష్టం జరుగుతుందని మానసిక వేదనతో సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటుచేసుకుంది.

Updated : 06 Dec 2022 06:37 IST

అందరు చూస్తుండగానే అఘాయిత్యం
నాలుగు గంటల పాటు ఉత్కంఠ

ఆంజనేయులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, లింగంపేట, న్యూస్‌టుడే: తన పొలం గుండా కాలువ నీటిని తీసుకెళ్తే నష్టం జరుగుతుందని మానసిక వేదనతో సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పుట్ట ఆంజనేయులు(38)కు ఊరచెరువు కింద అరగుంట భూమి ఉంది. యాసంగిలో పంటలు వేయడానికి రైతులు, రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం తైబందీ చేశారు. పంట కాల్వల పూడిక తీసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. కాల్వ తవ్వితే భూమిలో పంట పండకుండా పోతుందని మనోవేదకు గురైన ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం సెల్‌ టవర్‌ ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న ఆయన నష్టపరిహారం అందించాలని, ఘటనా స్థలానికి డీఎస్పీ రావాలని చరవాణిలో తహసీల్దారు మారుతి, ఎస్సై శంకర్‌ను కోరారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఇక్కడికి ఆర్డీవో శ్రీనునాయక్‌, డీఎస్పీ శ్రీనివాసులు చేరుకునేలోపే రైతు తన మెడలోని టవల్‌తో టవర్‌కు ఉరేసుకొని బలవన్మరణం పొందారు. ఆయన గతంలోనూ సెల్‌ టవర్‌ ఎక్కి, గడ్డిమందు తాగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడూ అలాగే చేస్తాడేమోనని గ్రామస్థులు, అధికారులు తేలికగా తీసుకున్నారు. ‘కిందికి దిగిరా నాన్నా’ అని ఆయన ముగ్గురు పిల్లలు భయంతో అరిచినా..  భార్య కన్నీరుమున్నీరుగా విలపించినా ఆయన పట్టించుకోలేదు. నాలుగు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. ఆత్మహత్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

రోదిస్తున్న పిల్లలు

మూడు సార్లు : తన పంట పొలం గుండా నీటి కాల్వ వెళ్లడానికి వీల్లేదని రెండేళ్ల క్రితం సెల్‌టవర్‌ ఎక్కి హంగామా సృష్టించారు. అప్పటి తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, ఎస్సై శ్రీకాంత్‌ నచ్చజెప్పి కిందకు దింపి రూ. 2 వేలు అందించారు. మరోసారి విద్యుత్తు తీగలు పట్టుకుంటానని వెళ్లాడని, ఇంకోసారి పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు.

అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు: మెంగారం వాసి పుట్ట కాశీరాంకు ముగ్గురు కొడుకులు. చిన్నవాడు ఆంజనేయులు. రెండో కొడుకు రాజుకు మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం.. ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. ఆయన పిల్లలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రామస్థులతో చరవాణిలో మాట్లాడారు.


దిగి రమ్మన్నా కరుణించకపోతివి

అడ్డంకులను ఎదురించడం నేర్పాల్సిన నీవు చిన్నపాటి సమస్యకు ఆగమైపోతివి.. అర గుంట భూమి కోసం వందేళ్ల జీవితం పణంగా పెడ్తివి.. నీ ప్రాణాలు తీసుకుని మా బతుకులు ఆగం చేస్తివి.. నీ చేయి పట్టుకుని నడవాలనుకున్న మా ఆశలు అడియాసలు చేస్తివి..


కళ్లెదుటే ప్రాణం పోతున్నా..

మధ్యాహ్నం ఒంటి గంటకు రైతు సెల్‌టవర్‌ ఎక్కారు. ఎస్సై శంకర్‌, తహసీల్దార్‌ మారుతి అక్కడికి చేరుకొని ఆంజనేయులుతో చరవాణిలో మాట్లాడారు. గతంలో పనిచేసిన తహసీల్దారు అమీన్‌సింగ్‌, డీఎస్పీ, ఎస్పీ రావాలని పట్టుబట్టారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా చరవాణిని కిందకు పడేశారు. అందరూ చూస్తుండగానే రైతు ఉరేసుకున్నారు. ప్రాణాలు విడిచి రెండు గంటలైనా ఎవరూ టవర్‌ ఎక్కలేదు. చివరికి సర్పంచి మహేశ్‌, ఓ రైతు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కిందకు దించారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని