logo

క్షయ నిర్మూలనే లక్ష్యంగా..

జిల్లాలో 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ వారంలో ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి.

Published : 08 Dec 2022 06:15 IST

సిబ్బందికి శిక్షణ పూర్తి
ఈ వారంలో ఇంటింటి సర్వే


శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం: జిల్లాలో 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ వారంలో ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి. ఇటీవల వారం రోజుల పాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే గుర్తించిన బాధితులకు ఔషధాలు అందజేస్తున్నారు. రోగుల ఖర్చుల నిమిత్తం నగదు ఇస్తున్నారు.  

భరోసా కల్పిస్తూ..

క్షయ కంటికి కనిపించని ప్రాణాంతక వ్యాధి. ఆర్థిక సమస్యల కారణంగా వ్యాధి సోకినా పలువురు పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల సహకారంతో బాధితులకు ఆత్మీయ భరోసా కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చి ప్రధాన మంత్రి క్షయ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహాయం కోసం ని-క్షయ మిత్ర యాప్‌ను ఏర్పాటు చేసింది. సర్వేలో భాగంగా క్షయ వ్యాధి సోకిన వారికి చికిత్స కాలంలో నెలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందజేస్తారు.

ఇప్పటికే 1,482 మంది గుర్తింపు

జిల్లాలో ఇప్పటికే క్షయ వ్యాధి సోకిన 1,482 మందిని గుర్తించారు. బిచ్కుంద పరిధిలో 282, దోమకొండ 222, గాంధారి 180, కామారెడ్డి 293, పిట్లం 241, ఎల్లారెడ్డి పరిధిలో 264 మందిని ఉన్నట్లు తేలింది. వీరందరికి చికిత్స అందుతోంది.  

6 క్లస్టర్లు..  10 బృందాలు

వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరు క్లస్టర్లలో పది బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బృంద బాధ్యులకు వివరాలు ఎలా సేకరించాలో అవగాహన కల్పించారు. ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం, బరువు కోల్పోవడం, తరచూ జ్వరం వస్తుండటం వంటి లక్షణాలు ఉన్నవారి వివరాలను నమోదు చేయాలని సూచించారు.  


ఆరోగ్య వివరాలు అందించాలి
- డా.ప్రవీణ్‌కుమార్‌, ప్రాజెక్టు అధికారి

ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది కోరిన వివరాలను పక్కాగా తెలపాలి. తద్వారా క్షయ ఉందో.. లేదో.. తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. సకాలంలో చికిత్స పొందితే ముప్పు నుంచి బయటపడొచ్చు. ఈ వారంలో క్లస్టర్ల వారీగా ఇంటింటికి వచ్చే వైద్యశాఖ సిబ్బందికి ప్రజలు సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని