logo

నేర్చుకుందామా ప్రాణవిద్య

హైదరాబాద్‌ జింఖానా మైదానంలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోగా అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ సీపీఆర్‌ అందించారు. ఈ ఘటన సెప్టెంబరులో చోటుచేసుకుంది.

Updated : 08 Dec 2022 08:12 IST

సీపీఆర్‌పై కొరవడిన అవగాహన
ఆశా కార్యకర్త ప్రయత్నం చర్చనీయాంశం
ఇందూరు ఫీచర్స్‌, న్యూస్‌టుడే

హైదరాబాద్‌ జింఖానా మైదానంలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోగా అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ సీపీఆర్‌ అందించారు. ఈ ఘటన సెప్టెంబరులో చోటుచేసుకుంది.


నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం కొండూరు గిర్ని చౌరస్తాలో అప్పటి వరకు మాట్లాడిన సాగర్‌ అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే గుర్తించిన ఆయన భార్య, ఆశా కార్యకర్త వాసవి వెంటనే సీపీఆర్‌(కార్డియోపల్మనరీ రిససీటేషన్‌) చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్రమైన నొప్పి కావడంతో ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన సోమవారం జరిగింది.


హైదరాబాద్‌లోనే మరో వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. నవంబరు చివరి వారంలో చోటు చేసుకుందీ ఘటన.


ఇలా అక్కడక్కడ సీపీఆర్‌ చేస్తుండటంతో ఇటీవల ఈ పదానికి ప్రాచుర్యం లభించింది. కానీ ఎలా చేయాలన్నది అవగాహన లేదు. దేశంలో 98 శాతం మందికి సీపీఆర్‌పై అవగాహనే లేదని చెబుతారు. వైద్య, అత్యవసర సిబ్బంది విధి అంటూ పొరబడుతుంటారు. గుండె వైద్య నిపుణులు మాత్రం ప్రతి ఒక్కరూ తెలిసి ఉండాల్సిన నైపుణ్యం అంటారు. ఇంట్లో ఆత్మీయులే అపస్మారక స్థితికి చేరితే అంబులెన్సు, లేదా ఆస్పత్రికి చేరుకునే వరకు ప్రాణం నిలబెట్టేది ఇదేనంటారు నిపుణులు.

ఇటీవల కాలంలో కూర్చున్న చోటనే కుప్పకూలడం, వేదికపై మాట్లాడుతూ, నృత్యం చేస్తూ, హాస్యం పండిస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ... అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు చాలానే చూశాం. వీరికి తక్షణం నాణ్యమైన సీపీఆర్‌ అందిస్తే కొంత మేరకైనా ప్రాణం నిలిపే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఎయిమ్స్‌ వంటి సంస్థలు దేశంలో సీపీఆర్‌పై విస్తృత అవగాహన, శిక్షణ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాల ఆధ్వర్యంలో తర్ఫీదునిస్తున్నారు.


ఇలాంటి ప్రయత్నాలు ప్రయోజనకరం..

గతంలో సంస్కార్‌ ప్లాన్‌ ఆధ్వర్యంలో కొనసాగిన పాఠశాలల్లో చిన్నారి డాక్టర్లు అనే విధానం కొనసాగించేవారు. 6-10 వ తరగతుల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసి వారికి ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించేవారు.

* ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేసి ఒకరిని చిన్నారి డాక్టర్‌గా పిలిచేవారు. తోటి విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, అనారోగ్యానికి గురైతే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చే బాధ్యతలు చూసేవారు. ఈ విధానం ఇప్పుడు బడుల్లో లేదు. వీటిని పునరుద్ధరించి వారికి ప్రథమ, అత్యవసర చికిత్సపై అవగాహన ఏర్పరిస్తే సమాజంలోకి చిన్నారి డాక్టర్లను పంపినట్లే.

* కేరళలో 2019లో సీపీఆర్‌ ప్రాధాన్యం గుర్తించి ఏక కాలంలో 35వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పాఠశాలల్లో ఇంకా నేర్పిస్తున్నారని చెబుతారు.


విద్యార్థులకు నేర్పిస్తే...

ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులనే తీసుకుంటే 5.24 లక్షల మంది ప్రాథమిక వైద్యులను సమాజంలోకి వదిలినట్లే. ప్రతి ఐదుగురికి ఒక సీపీఆర్‌ నిపుణుడు అందుబాటులోకి వస్తారు.


ఇలా చేయాలి

గుండెపోటు, ప్రమాదం, విషాహారం, పాముకాటు, నీట మునిగిన సమయంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో లేదా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటారు. వీరిని ప్రాథమికంగా స్పృహ కోల్పోయిన వ్యక్తులేనని గుర్తించడానికి మొదట వారి దగ్గరకు వెళ్లి భుజంపై తట్టి చెవి దగ్గర గట్టిగా అరచి లేపాలి. స్పందన కొరవడితే వెంటనే సీపీఆర్‌ ప్రక్రియలోకి దిగాలి. అది ఎలా చేయాలో ముంబయిలోని రిలయన్స్‌కు చెందిన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వైద్యంలో పీజీ చేసి విధులు నిర్వర్తిస్తున్న జిల్లా వాసి గోనె యజ్ఞ ఇలా చెబుతున్నారు.


అవకాశమున్న చోట అవగాహన
- సుదర్శనం, జిల్లా వైద్యాధికారి

ఇటీవల ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందికి అత్యవసర వైద్యంపై శిక్షణనిచ్చాం. వైద్య సిబ్బందికి అవగాహన ఉంది. విద్యాలయాల్లో వ్యాధులపై అవగాహన కల్పించే క్రమంలో అత్యవసర వైద్యంపైనా చెబుతుంటాం. అవకాశమున్న చోట సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తాం. అందరికీ ఉంటే ప్రయోజనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని