logo

టాస్క్‌కు వెనుకడుగు

డిగ్రీతోనే అయిదంకెల వార్షికాదాయంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల వివిధ కళాశాలల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.

Published : 09 Dec 2022 05:09 IST

వివరాల నమోదుకు కళాశాలలు దూరం
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

దరఖాస్తులు అందజేస్తున్న విద్యార్థులు

డిగ్రీతోనే అయిదంకెల వార్షికాదాయంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల వివిధ కళాశాలల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. సంస్థలో వచ్చే ఆటుపోట్లు, ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులతో సంబంధాల నిర్వహణ తదితర అంశాల్లో ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. టాస్క్‌ శిక్షణతోనే ఇది సాధ్యం అవుతోంది. అంత టి ప్రాధాన్యం ఉన్న దీనికి ఈ విద్యా సంవత్సరం అనేక కళాశాలలు దరఖాస్తులు సమర్పించలేదు. ఈ నెల 24 వరకు గడువు ఉంది. ఈలోపు ఆయా యాజమాన్యాలు స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

చదువుతూనే ఉద్యోగాలపై ఆసక్తి

ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల్లో నిర్వహించే ప్రాంగణ నియామకాల ద్వారా జిల్లాలో ఐదేళ్లలో 500 మంది ఎంపికయ్యారు. వీరికి రూ.18 వేల- రూ.25 వేల వరకు వేతనం ఉంది. అనుభవం ఆధారంగా మరింత పెరుగుతుందని సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.  

శిక్షణే కీలకం

డిగ్రీ విద్యార్థులకు ఏటా టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కళాశాలకు ఒక శిక్షకుడిని నియమిస్తున్నారు. వారు ఆంగ్లంపై పట్టు పెంపొందించుకునేలా మెలకువలు సూచిస్తారు. సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎదుటివారితో అలవోకగా మాట్లాడే నైపుణ్యాలు నేర్పుతారు. సంబంధాలను మెరుగపరుచుకునే అంశాలను మార్గదర్శనం చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 3,600 మంది విద్యార్థులు టాస్క్‌ శిక్షణకు వివరాలు నమోదు చేసుకున్నారు.


యాజమాన్యాలు స్పందించాలి: - శ్రీనాథ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా టాస్క్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌

ఉమ్మడి జిల్లాలో ఆయా కళాశాలల యాజమాన్యాలు టాస్క్‌ శిక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ ద్వారా విద్యార్థుల్లో మార్పు వస్తుంది. సామర్థ్యాలు మెరుగుపడతాయి. భావవ్యక్తీకరణ, సంబంధాల నిర్వహణపై పట్టు సాధిస్తారు. ప్రాంగణ నియామకాల్లో సునాయాసంగా విజయం సాధించేలా అడుగులు వేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని