logo

తానియా.. మేనియా

ఒక వైపు చదువులో తనకంటూ స్థానాన్ని సంపాందించుకొంటూ మరో వైపు యోగా, చిత్రలేఖనం, కవితా రచనలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Published : 19 Jan 2023 04:46 IST

యోగా, చిత్రలేఖనం, కవితా రచనలో ప్రతిభ

యోగా సాధన చేస్తూ

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పట్టణం: ఒక వైపు చదువులో తనకంటూ స్థానాన్ని సంపాందించుకొంటూ మరో వైపు యోగా, చిత్రలేఖనం, కవితా రచనలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వివేకానందుడి విలువలు, అబ్దుల్‌ కలాం ఆశయాలే తన లక్ష్య సాధనకు మార్గదర్శంగా నిలిచాయని చెబుతున్నారు ఆర్మూర్‌ పట్టణానికి చెందిన శేరు పోశెట్టి-లక్ష్మి కుమార్తె తానియా. ఇంటర్‌ నుంచి ఐఐటీ ప్రవేశం వరకు ప్రతిభచాటారు. దక్షణ సంస్థ పరీక్షల విభాగంలో రాష్ట్ర సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు. గతేడాది డిసెంబరు 26న మహారాష్ట్రలోని పుణెలో దక్షణ ఫౌండేషన్‌ సంస్థ ఆమెకు బంగారు పతకం ప్రదానం చేసింది.

తానియా నిజాంసాగర్‌ నవోదయ విద్యాలయంలో 6 నుంచి 8 వరకు చదివారు. తన ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించారని చెబుతోంది. 2016లో రాజస్థాన్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రాణించారు. జాతీయ సమైఖ్యత పెంపొందించేందుకు నవోదయ సమితి కొందరిని ఎంపిక చేసి ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి చదివేందుకు పంపించడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం మధురలో విద్యాలయం తరఫున పాల్గొని యోగాలో 2017లో స్వర్ణం గెలుచుకున్నారు. ప్రధాని మోదీ రచించిన పరీక్ష యోధుల పుస్తకంపై రాసిన సమీక్ష పరీక్ష పే చర్చ 2.0 కార్యక్రమానికి ఎంపికైంది. ఇది తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని చెబుతున్నారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకుంటూ..


సైబర్‌ సెక్యూరిటీలో  సేవలందిస్తా

శేరు తానియా

విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాభ్యాసం, పుస్తక పఠనంపై నాన్న సూచనలు నాలో స్ఫూర్తి నింపాయి. అబ్దుల్‌ కలాం జీవితంలోని ప్రతి ఘట్టం ప్రేరణనిచ్చింది. మానవాళిని ముందుకు నడిపించే కొత్త టెక్నాలజీలో డిజిటల్‌ రంగం ముఖ్యమైంది. ఇందులో పౌరుల గోప్యత, ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకొని సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో సేవలందిస్తా.


ఐఐటీ లక్ష్యంగా...

పదో తరగతి చదువుతున్నప్పుడు ఐఐటీలో సీటు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు.   దక్షణ ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రతిభ పరీక్షలో రాణించడంతో భారత ప్రభుత్వ విజ్ఞాన్‌ జ్యోతి ఆర్థిక ప్రోత్సాహకంతో ఉత్తర్‌ప్రదేశ్‌ మధురలో ఇంటర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీలో డేటా సైన్స్‌ కోర్సులో సీటు పొందారు. ఫౌండేషన్‌ సంస్థకు రాష్ట్ర సమన్వయకర్తగా అందించిన సేవలకు గుర్తింపుగా పబ్లిక్‌ రిలేషన్‌ కమిటీ జూనియర్‌ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఫౌండేషన్‌ సేవలు విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. చిత్రలేఖనం, కవితా రచనల్లోనూ రాణిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు