logo

పంట చీటీల్లో.. దళారుల మంట

సుమారు 40 ఏళ్లుగా జిల్లాలో అన్నదాతలు సమూహాలు(సంఘాలు)గా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నారు. పంట చీటీల పేరుతో మూడు, ఆరు  నెలలకోమారు సమావేశం నిర్వహించుకుని  జమ చేసుకున్న నగదును అవసరాల మేరకు పంపిణీ  చేసుకుంటున్నారు.

Updated : 22 Jan 2023 07:33 IST

 రైతులు..తస్మాత్‌ జాగ్రత్త

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, భిక్కనూరు


భిక్కనూర్‌ మండలం గుర్జకుంటలో ఓ వ్యక్తి సుమారు నలభై పంట చీటీల సంఘాల్లో సభ్యుడిగా నమోదై ఇటీవల రూ.80 లక్షల మేర రైతుల సొమ్ము స్వాహా చేసి ఉడాయించాడు. మండలంలోని బస్వాపూర్‌, భిక్కనూర్‌, రామేశ్వరపల్లి, తిప్పాపూర్‌, ర్యాగట్లపల్లి, లక్ష్మీదేవునిపల్లి గ్రామాల్లోని సంఘాలనూ మోసం చేశాడు.

సుమారు 40 ఏళ్లుగా జిల్లాలో అన్నదాతలు సమూహాలు(సంఘాలు)గా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నారు. పంట చీటీల పేరుతో మూడు, ఆరు  నెలలకోమారు సమావేశం నిర్వహించుకుని  జమ చేసుకున్న నగదును అవసరాల మేరకు పంపిణీ  చేసుకుంటున్నారు. ఒకేసారి పెద్ద  మొత్తం రావడంతో పంట పెట్టుబడులు, పిల్లల  చదువులు, పెళ్లిళ్లకు ఖర్చు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని గ్రామాల సమూహాల్లోకి దళారులు చొరబడి ఆరుగాలం శ్రమించి పొదుపు చేసుకున్న సొమ్మును స్వాహా చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

గ్రామగ్రామాన..

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో పంట చీటీలు నడుస్తున్నాయి. పొదుపుతో పాటు సాగు సమస్యలపై చర్చించుకుంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా సాగుతున్న ఈ సంఘాల్లోకి ప్రైవేటు వ్యక్తలు, వడ్డీ వ్యాపారులు ప్రవేశించి అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యంగా కమీషన్‌ ఎరవేసి సంఘాల్లో సభ్యులుగా చేరుతున్నారు. తామే చీటీ నడుపుతామని నమ్మబలుకుతున్నారు. నిర్దేశిత సమయంలో డబ్బులు అందిస్తామని హామీలిస్తూ మచ్చిక చేసుకుంటున్నారు.  

అసలెందుకు ఇవి..?

పూర్వం నగదు చలామణి అంతంత మాత్రమే ఉండేది. ఈ నేపథ్యంలో రైతులు పది నుంచి పదిహేను మంది ఓ సంఘంగా ఏర్పడి పొదుపు చేసుకోవడం ప్రారంభించారు. పంట చేతికొచ్చే కాలాన్ని బట్టి ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి కొంత సొమ్మును పొదుపు చేసుకుంటారు. ఉదాహరణకు పది మంది సభ్యులు సమూహంగా ఏర్పడి ఆరు నెలలకు రూ.50 వేల చొప్పున జమ చేసుకుంటారు. ఈ పోగైన రూ.5 లక్షలను డ్రా ఆధారంగా ఒక సభ్యుడికి ఇస్తారు. ఇలా వాయిదాల ప్రకారం అందరూ రూ.5 లక్షల చొప్పున పొందుతారు. డ్రాలో మొదట గెలిచిన వ్యక్తులు ప్రతి వాయిదాలో ఎక్కువ మొత్తం.. మిగతా వారు తక్కువ మొత్తం చెల్లిస్తూ వస్తారు. ఎటువంటి కమీషన్‌ ఉండదు.

ఒక్క ర్యాగట్లపల్లిలోనే 60 సంఘాలు

కూరగాయలు పండించే పల్లెల్లో ఈ సంఘాలు నెలకోమారు సమావేశమై పొదుపు చేసుకుంటున్న సొమ్మును పంపిణీ చేసుకుంటున్నారు. భిక్కనూర్‌ మండలంలోని ర్యాగట్లపల్లిలో ప్రతి నెల ఒకటో తేదీన పంచాయతీ కార్యాలయం వద్ద ఇదే హడావుడి ఉంటుంది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 60 సంఘాలున్నాయి. అందులోని సభ్యులు తమ సామర్థ్యం మేరకు నెలవారీగా జమ చేసుకుంటూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని