logo

కేటీఆర్‌ సారూ.. ఇదండీ పురపాలికల తీరు

‘‘పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దాదాపు మూడున్నరేళ్ల తర్వాత నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. గతేడాది సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆయన వచ్చినా.. అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు.

Published : 28 Jan 2023 02:52 IST

ఈనాడు, నిజామాబాద్‌

‘‘పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దాదాపు మూడున్నరేళ్ల తర్వాత నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. గతేడాది సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆయన వచ్చినా.. అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. మంత్రి హోదాలో ఆయన జిల్లాకు రావటం ఇది రెండోసారి. 2019 ఆగస్టులో ఐటీహబ్‌ భవనానికి భూమిపూజ చేశారు.’’

జిల్లాకేంద్రంలో నగర పాలకసంస్థకు సంబంధించి..పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పనుల పర్యవేక్షణలో ఇబ్బందులెదురవుతున్నాయి. దీనికి కారణం.. పూర్తిస్థాయి అధికారులు లేకపోవటమే. కీలక పోస్టుల్లో ఇన్‌ఛార్జులే కొనసాగుతుండటం అభివృద్ధిపై ప్రభావం చూపుతోందనే విమర్శ ఉంది.
పాలనపై ప్రభావం.. పూర్తిస్థాయి కమిషనర్‌ లేరు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ప్రజారోగ్య అధికారి లేరు. శానిటరీ సూపర్‌వైజర్‌ చూస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి డీసీపీ లేరు. ఏసీపీ శ్యాంకుమార్‌ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనపు కమిషనర్‌ పోస్టు చాలాకాలంగా ఖాళీగా ఉంటోంది. ఇది పురపాలనపై ప్రభావం చూపుతోంది. మున్సిపల్‌ రెవెన్యూ విభాగం అధికారి ఆర్మూర్‌ మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా, మేనేజర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ఇంజినీరు పోస్టుదీ అదేకోవ. భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి వేల్పూర్‌ తహసీల్దారు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్నారు.
ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఇన్‌ఛార్జులుగా ఉన్నవారు తమ సొంత పోస్టు విధులకు ఇచ్చినంత ప్రాధాన్యం.. అదనపు బాధ్యతల విషయంలో ఇవ్వటం లేదనేది నగరపాలక సంస్థ పాలకవర్గాల్లోనూ ఉంది.

బృహత్‌ప్రణాళికలు అవసరం.. నగర పాలక సంస్థ, నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిని కలిపి బృహత్‌ప్రణాళికను సిద్ధం చేశారు. 568.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆరు జోన్లుగా దీనిని రూపొందించారు. ఇప్పటికే సాంకేతిక అనుమతులు పూర్తి చేసుకొని దస్త్రం ప్రభుత్వం వద్దకు చేరింది. దీనికి రాజముద్ర పడాల్సి ఉంది. ఏటా పట్టణ ప్రగతి, ఇతర ప్రత్యేక నిధులు రూ.కోట్లతో పనులు చేపడుతున్నారు. వీటిని కేటాయించే క్రమంలో ప్రణాళిక బద్ధమైన ప్రగతిని సాధించాలి. ఇది మాస్టర్‌ ప్లాన్‌ అమలు ద్వారా సాధ్యమవుతుంది. ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీలు కూడా మాస్టర్‌ ప్లాన్లు లేకుండా ఉన్నాయి. వాటి విషయంలోనూ చొరవ చూపాల్సి ఉంది.


పర్యటన ఇలా..

8:45 హెలిక్యాప్టర్‌లో నూతన కలెక్టరేట్‌కు చేరుకుంటారు.

9 - 11: గంటల మధ్య భూమారెడ్డి కన్వెన్షన్‌లో సాండ్‌ బాక్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

11:00: రైల్వే కింది వంతెన ప్రారంభం.

11:30: పాత కలెక్టరేట్‌లో కళాభారతి ఆడిటోరియం పనులకు శంకుస్థాపన. 

మధ్యాహ్నం: 12:00 భారాస జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం, పార్టీ నాయకులను కలుస్తారు.


ఏర్పాట్ల పరిశీలన

నగరంలోని ఆర్‌యూబీ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

నిజామాబాద్‌ నగరం: జిల్లాకేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో శుక్రవారం పాలనాధికారి నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా పర్యటించారు. ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి మురళీ మనోహర్‌రెడ్డి, రషీద్‌, రాజశేఖర్‌ తదితరులున్నారు.

ఇందూరు సిటీ: మంత్రి కేటీఆర్‌ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 150 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిసింది. ఏర్పాట్లపై సీపీ నాగరాజు నిజామాబాద్‌ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు, సీఐలతో సమీక్షించారు.   పలువురిని ముందస్తు   అరెస్టు చేశారు.  పలు దారుల్లో   ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు