logo

రోడ్డు ప్రమాదాలు తగ్గేదెన్నడు?

డిచ్‌పల్లి మండలం సాంపల్లి ముఖద్వారం ఇది. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు.

Published : 30 Jan 2023 03:04 IST

జాతీయ రహదారిపై కానరాని భద్రత చర్యలు

డిచ్‌పల్లి మండలం సాంపల్లి ముఖద్వారం ఇది. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ ఇక్కడ సర్వీస్‌ రోడ్డు, ప్రయాణ ప్రాంగణం సౌకర్యం లేదు. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నా ఫలితం దక్కడం లేదు.

సుద్దపల్లి సీఎంసీ వద్ద సర్వీస్‌ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు ఇలా రాంగ్‌రూట్లో ప్రయాణిస్తున్నారు. ఇదీ బ్లాక్‌స్పాట్‌ ప్రాంతమే. గత నాలుగు నెలల కిందట ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. సర్వీస్‌ రోడ్డు వేయాలని స్థానికులు ఆందోళన చేపట్టడంతో అధికారులు హామీ ఇచ్చారు. ఇంకా అమలుకు నోచుకోవడం లేదు.

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి

44వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రత చర్యలు తీసుకోవడం లేదు. బ్లాక్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. కొన్నిచోట్ల సర్వీస్‌ రోడ్లు అందుబాటులోకి రాలేదు.

95 కిలోమీటర్లు..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 95 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. 2019-21 వరకు తొమ్మిది బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. రోడ్డు నిర్మాణంలో లోపాలు, మానవ తప్పిదాలు కలిపి రోజుకు సగటున ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బాల్కొండ మండల కేంద్రంతో పాటు డిచ్‌పల్లిలోని సీఎంసీ, సాంపల్లి, పడకల్‌తండా, అడ్లూర్‌ ఎల్లారెడ్డి బ్లాక్‌స్పాట్ల వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

రాత్రి వేళల్లో..

ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం 59 సర్వీసురోడ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల ఇవి అధ్వానంగా మారాయి. అర్గుల్‌, బ్రాహ్మణపల్లి, జక్రాన్‌పల్లి తండా, మాదాపూర్‌, సికింద్రాపూర్‌, సుద్దపల్లి, బీబీపూర్‌ తండా, గన్నారం, చంద్రాయన్‌పల్లి, పద్మాజివాడ, సదాశివనగర్‌, చక్కెర ఫ్యాక్టరీ, అడ్లూర్‌ ఎల్లారెడ్డి దగ్గర సర్వీసు రోడ్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వసతులు మెరుగుపర్చాలి

ఇందల్‌వాయి, భిక్కనూర్‌ వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. జంక్షన్ల వద్ద దీపాలు ఉన్నా వెలగడం లేదు. యూటర్న్‌ల వద్ద ఉన్న సూచికలను బాగు చేయాల్సి ఉంది.


బోర్డుల ఏర్పాటు తప్పనిసరి

- రవీందర్‌, సాంపల్లి

జాతీయ రహదారి ఆనుకొని ఉన్న అన్ని గ్రామాలకు సర్వీసు రోడ్లు వేయాలి. బ్లాక్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి.


పనులు ప్రారంభిస్తాం
- తరుణ్‌కుమార్‌, హైవే అథారిటీ టెక్నికల్‌ మేనేజర్‌

జాతీయ రహదారిపై 2019-21లో తొమ్మిది బ్లాక్‌స్పాట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మార్చి-ఏప్రిల్‌లో అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని