logo

పసుపు సాగుకు దూరం

పాయగా.. పాయగా పంట పండితే పదేళ్ల అప్పైనా తీర్చొచ్చనే నానుడిని నమ్ముకొని ఆర్మూర్‌ డివిజన్లో మూడోవంతు రైతులు ప్రధాన పంటగా పసుపు సాగు చేస్తున్నారు.

Published : 30 Jan 2023 03:04 IST

ఏటేటా తగ్గుతున్న దిగుబడులు
విత్తనమైనా పండని పరిస్థితి
న్యూస్‌టుడే, వేల్పూర్‌

వేల్పూర్‌లో తవ్విన పసుపు పంట

పాయగా.. పాయగా పంట పండితే పదేళ్ల అప్పైనా తీర్చొచ్చనే నానుడిని నమ్ముకొని ఆర్మూర్‌ డివిజన్లో మూడోవంతు రైతులు ప్రధాన పంటగా పసుపు సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా దిగుబడి ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లకు మించి రావడం లేదు. అధిక వర్షాలతో తెగుళ్ల బెడద నెలకొంది. కనీసం మార్కెట్లో ధరైనా దక్కుతుందా అంటే అదీ లేదు. 15 ఏళ్ల కిందట ధరే ఉంది. సగటున క్వింటా రూ.4800 - రూ.5200 పలుకుతోంది. వ్యయం ఎకరానికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. ఫలితంగా సగటున ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు నష్టం చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. చివరకు ఈ పంట సాగుకే దూరమవుతున్నారు.

వేల్పూర్‌లో 280 మంది పసుపు రైతులు 800 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేవారు. గతేడాది 30 మంది రైతుల పొలంలో నుంచి కనీసం విత్తనమైనా వెళ్లలేదు. ఈ  ఏడాది ఏకంగా వంద మంది అన్నదాతలు సాగు మానేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పంట తీస్తున్న తరుణంలో ఎక్కడా విత్తనం రావడం లేదు. కొందరు ముందుకొచ్చినా ప్రతి కొమ్ముకు దుంపకుళ్లు తెగులు కనిపిస్తోంది. వాటిని విత్తనంగా మారిస్తే పంట వేసే సమయానికి కుళ్లిపోతాయని వాపోతున్నారు. కొత్తగా విత్తనం కొనుగోలు ఇష్టం లేక సాగే వద్దనే నిర్ణయానికి వచ్చారు.

ఇక వేయను

మా తండ్రి కాలం నుంచి పసుపు సాగు చేస్తున్నాం. నేనే స్వయంగా 20 ఏళ్ల నుంచి ఏటా నాలుగెకరాల్లో వేస్తున్నా. కూలీల వ్యయం, పెట్టుబడి భారీగా పెరుగుతుంటే ధర తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు అధిక వర్షాలతో విత్తనం పూర్తికైనా పంట పండే పరిస్థితి లేదు. అందుకే వచ్చే సీజన్‌ నుంచి సాగు మానుకుంటున్నాను. వేల్పూర్‌లో ఇప్పటికే పదుల సంఖ్యలో నాలాగే నిర్ణయించుకున్నారు. ఇది మా ఒక్క గ్రామంలోనే కాదు.. అంతటా ఇదే పరిస్థితి ఉంది.

- బద్దం హరికిషన్‌, వేల్పూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని