logo

శిలాఫలకం వివాదం

రూ.4.5 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది.

Updated : 30 Jan 2023 12:54 IST

మల్లాపూర్‌-లోలం గ్రామస్థుల మధ్య ఘర్షణ

ఆందోళనకారులను సముదాయిస్తున్న పోలీసులు

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: రూ.4.5 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. పోలీసులు కలగజేసుకొని ఇరు గ్రామస్థులను చెదరగొట్టారు. దీంతో ఎమ్మెల్యే అభివృద్ధి పనులు ప్రారంభించకుండా తిరిగి వెళ్లిన ఘటన ఇందల్‌వాయి మండలం లోలం పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మల్లాపూర్‌ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రాంపూర్‌, తిర్మాన్‌పల్లి, ఎల్లారెడ్డిపల్లి మీదుగా లోలం చేరుకున్నారు. అప్పటికే లోలం గ్రామస్థులు.. మల్లాపూర్‌-లోలం గ్రామాల మధ్య నిర్మించిన వంతెనపై ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. వంతెన తర్వాత ప్రారôభించుకుందామని, ఎమ్మెల్యే మారోమార్గంలో గ్రామానికి వచ్చారని వారికి సమాచారం అందింది. అయినా వారధి ప్రారంభించాల్సిందేనని గ్రామస్థులు పట్టుపట్టి అక్కడే బైఠాయించారు. అంతలోనే అక్కడికి వచ్చిన మల్లాపూర్‌ గ్రామస్థులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలవారిని చెదరగొట్టారు. లోలం గ్రామస్థులు మాత్రం గ్రామానికి వెళ్లకుండా వంతెన వద్ద నిరసనకు దిగారు. ఎంపీపీ రమేష్‌నాయక్‌, ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌ గ్రామస్థులను సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే అభివృద్ధి పనులు ప్రారంభించకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై పంచాయితీరాజ్‌ డీఈ శంకర్‌ని వివరణ కోరగా.. ఎక్కడైనా వారధి ప్రారంభోత్సవంలో ఒకే గ్రామానికి చెందినవారి పేర్లు రాస్తామన్నారు. దీనిపై శనివారం రాత్రి మల్లాపూర్‌ గ్రామస్థులు ఎమ్మెల్యే వద్ద అభ్యంతరం తెలపగా.. రెండు గ్రామాల సర్పంచుల పేర్లతో శిలాఫలకాన్ని మధ్యలో ఏర్పాటు చేసి మరోసారి వంతెన ప్రారంభోత్సవం పెడదామని ఇరుగ్రామాల వారికి చెప్పి పంపారన్నారు. ఆదివారం ఉదయం ఏం జరిగిందో తెలియదని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని