logo

కేంద్రీయ విద్యాలయానికి నిధులు మంజూరు

దాదాపు దశాబ్ద కాలంగా తాత్కాలిక భవనంలో అరకొర వసతుల మధ్య ఉమ్మడి నిజామాబాద్‌ కేంద్రీయ విద్యాలయం(కేవి) కొనసాగుతోంది.

Published : 30 Jan 2023 03:04 IST

రూ.21 కోట్లతో నిర్మాణానికి ఆమోదం
న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం

బెల్లాల్‌లో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పాఠశాల

దాదాపు దశాబ్ద కాలంగా తాత్కాలిక భవనంలో అరకొర వసతుల మధ్య ఉమ్మడి నిజామాబాద్‌ కేంద్రీయ విద్యాలయం(కేవి) కొనసాగుతోంది. ఎట్టకేలకు రూ.21 కోట్లతో భవన నిర్మాణానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే బడికి సొంత భవనం అందుబాటులోకి వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్ష తీరనుంది.

2014లో ప్రారంభం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవి లేని ఏకైక జిల్లా నిజామాబాద్‌. దీంతో విద్యాశాఖ అధికారులు దీన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖకు లేఖలు పంపించారు. బోధన్‌లో విద్యాలయ ఏర్పాటుకు తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి పాండుఫారం శివారులో 8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నివేదించారు. దీంతో 2014లో విద్యాలయం మంజూరైంది. 2015 విద్యా సంవత్సరం నుంచి బెల్లాల్‌లోని మధుమలాంచ జూనియర్‌ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. వసతులు లేని ఈ భవనంలోనే ప్రస్తుతం 380 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీని తరువాత జిల్లా కేంద్రానికి మంజూరైన మరో కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనం ఉండగా.. ఇక్కడ 8 ఏళ్ల తరువాత నిధులు కేటాయించారు.

ప్రయోజనాలు ఇవీ ..

గతేడాది బెల్లాల్‌ కేంద్రీయ విద్యాలయంలో నీట్‌, ఐఐటీ వంటి పరీక్ష కేంద్రాలను నిర్వహించారు. సొంత భవనం అందుబాటులోకి వస్తే మరిన్ని నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి కనబర్చడంతో బోధనలో నాణ్యత ప్రమాణాలు పెరిగి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇంటర్మీడియెట్‌ వరకు అప్‌గ్రేడ్‌ అవుతుంది. పాండుఫారం శివారులో త్వరలో శంకుస్థాపన చేసేందుకు కేవి సంఘటన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని