logo

పనుల్లో జాప్యం.. మరమ్మతులు శూన్యం

‘‘అది ఏళ్లనాటి గొలుసుకట్టు చెరువు. ఏటా ఆయకట్టుకు నీరందిస్తూ అన్నదాతలకు సిరులు కురిపించేది.

Published : 30 Jan 2023 03:04 IST

తెగిపోయిన పడకల్‌ పెద్ద చెరువుకట్ట
న్యూస్‌టుడే, జక్రాన్‌పల్లి

‘‘అది ఏళ్లనాటి గొలుసుకట్టు చెరువు. ఏటా ఆయకట్టుకు నీరందిస్తూ అన్నదాతలకు సిరులు కురిపించేది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండింది. కట్ట బలహీనపడటంతో తెగిపోయి పచ్చని పంటలను నీట ముంచింది. ఇది జరిగి ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. చుక్క నీరు లేక ఆయకట్టు బీడుగా మారింది.’’

జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ పెద్ద చెరువుకు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది జులై 13న వచ్చిన భారీ వరదతో కట్టకు గండి పడి.. పడకల్‌, కేశ్‌పల్లి, మనోహరాబాద్‌, కొలిప్యాక్‌ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదే నెల 21న కేంద్ర మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్‌రాయ్‌, సభ్యులు దీప్‌శేఖర్‌ సింఘాల్‌, కృష్ణప్రసాద్‌తో పాటు జిల్లా పాలనాధికారి నారాయణ్‌రెడ్డి వచ్చి పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.1.44 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ఆ తర్వాత అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

యాసంగి సాగుకు దూరం

కట్ట తెగిపోవడంతో ఆయకట్టు పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం నీరు లేక యాసంగి సాగుకు దూరమయ్యారు. మరో అయిదు నెలల్లో వర్షాకాలం రాబోతోంది. ఆలోపు మరమ్మతులు చేపట్టకుంటే నీరు నిలిచే అవకాశం ఉండదు. దీనికితోడు వచ్చే వరద పొలాల మీదుగానే పారనున్నందున పంటలు పండించడం కష్టం. నీటి నిల్వలేక ఆ తర్వాత వచ్చే యాసంగి సాగూ ప్రశ్నార్థకం కానుంది.

త్వరలో ప్రారంభిస్తాం
- గంగాధర్‌, జలవనరుల శాఖ, డీఈఈ

పడకల్‌ పెద్ద చెరువు కట్ట మరమ్మతులకు రూ.85 లక్షల నిధులు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని