logo

పంచాయతీ ఖర్చులు.. లేవు లెక్కలు

గ్రామ పంచాయతీల(జీపీ) లెక్కలపై ఆడిట్‌శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2021-22 వార్షిక ఏడాదిలో నిర్వహణ లోపాలను ఎత్తిచూపింది.

Published : 30 Jan 2023 03:04 IST

జిల్లాలో 6,624 అభ్యంతరాలు
2021-22 లావాదేవీలపై ఆడిట్‌శాఖ నివేదిక
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

గ్రామ పంచాయతీల(జీపీ) లెక్కలపై ఆడిట్‌శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2021-22 వార్షిక ఏడాదిలో నిర్వహణ లోపాలను ఎత్తిచూపింది. ఆయా పాలకవర్గాల నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసింది. ఈ మేరకు జిల్లాలోని 526 జీపీల్లో 6,624 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏటా పంచాయతీలు, మండల పరిషత్తు, పురపాలికలు, ఆలయాలు, ఏఎంసీల ఖర్చులపై ఆడిట్‌ చేస్తుంది. నిధుల దుర్వినియోగం, లెక్కల్లో తేడాలు, నిబంధనలకు వ్యతిరేకంగా చేసే ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది.

కొరవడిన అవగాహన

జీపీల్లో రికార్డుల నిర్వహణకు సంబంధించి కొందరు కార్యదర్శులకు అవగాహన కొరవడింది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసినట్లు ఆడిట్‌లో తేలింది. చాలాచోట్ల జూనియర్‌ కార్యదర్శులు ఉండడంతో సర్పంచులు, పాలకమండలి సభ్యులు వారిపై ఒత్తిడి తెచ్చి వివిధ పనులకు బిల్లులు రాయించారు. ఆడిట్‌శాఖ అభ్యంతరం తెలుపుతుందని చెప్పినా కొందరు సర్పంచులు వినిపించుకోలేదని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆడిట్‌ అధికారులకు రికార్డులు సమర్పించడానికి నానా తంటాలు పడ్డారు. రెండు వారాలు గడువు ఇచ్చినా ఇవ్వలేకపోయారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

వేలల్లో అవకతవకలు

* జిల్లావ్యాప్తంగా గత నెలలోనే ఆడిట్‌ పూర్తయింది. నివేదికలను ప్రభుత్వానికి నివేదించారు. - జీపీలకు ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు అందుతున్నాయి. స్థానికంగా వసూలయ్యే పన్నులు ఉంటాయి. - ఆర్థిక సంఘాలు, జనరల్‌ ఫండ్‌ నిధుల ఆదాయ, వ్యయాల్లో తేడా ఉన్నట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. నిర్దేశిత పనులకు కాకుండా ఇతర వాటికి మళ్లించినట్లు తేల్చారు. కొన్నిచోట్ల ఖర్చులకు సంబంధించిన వోచర్లు సక్రమంగా లేవన్నారు.

* కొన్ని జీపీల్లో వసూలు చేసిన పన్నులు జమ చేయలేదు. ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్‌ నోటీసులు ఇవ్వడంలో అధికారులు వైఫల్యం చెందారు.

* కొన్ని పంచాయతీలు తైబజార్‌ నిర్వహణ వివరాలను రికార్డుల్లో చూపకపోవడాన్ని తప్పుబట్టారు.

* పంచాయతీ ట్రాక్టర్ల నిర్వహణ, జీతభత్యాలు, డీజిల్‌ ఖర్చులు, తాగునీటి సరఫరా ఖర్చులపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

* వీటన్నింటికి సరైన లెక్కలు జీపీల వద్ద లేకపోవడంతో ఆడిట్‌శాఖ నోటీసులు జారీ చేయడానికి సన్నద్ధమవుతోంది.

* అభ్యంతరాలకు సంబంధించి ఎన్ని నిధులు దుర్వినియోగమయ్యాయో త్వరలో వెల్లడించనున్నారు.

నిబంధనల ప్రకారం పూర్తి  - కిషన్‌ పామర్‌, జిల్లా ఆడిటర్‌, కామారెడ్డి

గ్రామ పంచాయతీల్లో ఆడిట్‌ ప్రక్రియ గత నెలలోనే పూర్తి చేశాం. ఎన్ని నిధులు దుర్వినియోగమయ్యాయో తెలియడానికి కొంత సమయం పడుతుంది. ఆడిట్‌ చట్టం ప్రకారం అభ్యంతరాలు లెవనెత్తాం. నివేదికలు జిల్లా కలెక్టర్‌కు సమర్పించి ఆయన సూచన ప్రకారం ముందుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని