logo

విశ్వాన్ని ఏలేది ధర్మమే

‘ప్రతి జీవి కణాన్ని కర్మే నిర్ణయిస్తుంది. ఎవరు ఎక్కడ ఎలా పుట్టాలో ముందే తేలిపోతుంది. లోకంలో చెడును రూపుమాపేందుకు ఏదో రూపంలో నారాయణుడు ఉద్భవిస్తూనే ఉంటాడు’ అని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 03:36 IST

భక్తులను కట్టిపడేసిన పరిపూర్ణానంద ప్రసంగం
అట్టహాసంగా ముగిసిన సాధూ సమ్మేళనం

హాజరైన భక్తులు : మాతాజీలకు పుష్పాభిషేకం చేస్తున్న రాములు మహరాజ్‌

నందిపేట్‌ గ్రామీణం : ‘ప్రతి జీవి కణాన్ని కర్మే నిర్ణయిస్తుంది. ఎవరు ఎక్కడ ఎలా పుట్టాలో ముందే తేలిపోతుంది. లోకంలో చెడును రూపుమాపేందుకు ఏదో రూపంలో నారాయణుడు ఉద్భవిస్తూనే ఉంటాడు’ అని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద పేర్కొన్నారు. నందిపేట్‌లోని కేదారేశ్వరాలయంలో కొనసాగుతున్న సాధూసమ్మేళనానికి బుధవారం ఆయన హాజరై ప్రవచించారు. దేవుడు ప్రతిజీవి అంతరాత్మలో ఉండి గమనిస్తాడు. విశ్వమంతటా అమ్మవారు ఉంటారని గుర్తెరగాలి అని సూచించారు. దేవీమాత ఎన్ని ప్రదేశాలు ఉన్నా.. భారతదేశాన్నే తన స్థానంగా ఎంచుకుందని.. అందుకే నదులకు అమ్మవారి పేర్లు పెట్టుకున్నామని చెప్పారు. మనల్ని భౌతికంగా రాజ్యాంగమే నడిపించినా ధర్మమే ఈ విశ్వాన్ని ఏలుతుందని.. ప్రతిదీ తపోశ్శక్తితో సాధించొచ్చని చెప్పారు. రచయిత, గాయకుడు కర్క రమేశ్‌ రూపొందిన ‘ఎగరాలి.. ఎగరాలి కాషాయ జెండా’ ఆడియో సీడీని సాధూపరిషత్‌ సభ్యులు ఆవిష్కరించారు. ధర్మ పరిరక్షణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని అఖిలాంధ్ర సాధూపరిషత్‌ అధ్యక్షురాలు శ్రీమాతా పరావిద్యానందగిరి అన్నారు.

మాతాజీలకు ఘన సత్కారం : సాధూపరిషత్‌ సమ్మేళనం కనులపండువగా ముగిసింది. పలుగుట్టకు వచ్చిన 40 మంది మాతాజీలను ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేశారు. మహాసభకు హాజరైన దాదాపు 500 మంది స్వామీజీలు, పీఠాధిపతులు, సాధువులకు ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆశ్రమ వ్యవస్థాపకుడు రాములు మహరాజ్‌ బొట్టు పెట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా 1,331 పూర్ణకలశాలను భక్తులకు పంపిణీ చేశారు. ఏర్పాట్లలో భాగస్వాములైన ఆశ్రమ కమిటీ, గ్రామకమిటీ, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

పలుగుట్ట పైకి సీసీ రోడ్డు : పలుగుట్టపై ఉన్న గ్రామ పోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు సీసీ రోడ్డు కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. త్వరలో ఆలయ పరిసరాల్లో ఆసుపత్రి నిర్మించుకుందామని చెప్పారు. గుట్టను పరిరక్షించుకునేందుకు 53 ఎకరాలు సేకరించి పెట్టామన్నారు. సిద్ధుల గుట్ట మాదిరిగా పలుగుట్ట దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాధూపరిషత్‌ సభ్యులు సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని