logo

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్‌ నమోదు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు అక్కడే ఆధార్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 02 Feb 2023 03:36 IST

పుట్టిన వెంటనే కార్డు సిద్ధం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు అక్కడే ఆధార్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోల్చితే సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే పిల్లల ఆధార్‌ నమోదుపై తల్లిదండ్రులు దృష్టి సారించడం లేదు. మారుమూల ప్రాంతాల్లోని వారికి ఇవన్నీ తెలియడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం చైల్డ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ క్లైంట్‌ విధానాన్ని తీసుకొచ్చింది. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌ దవాఖానాల్లో శిశువుల ఆధార్‌ నమోదు చేస్తున్నారు.

శిశువు చిత్రాలతో..

కేసీఆర్‌ కిట్ల పంపిణీ ప్రక్రియ బాధ్యతలు చూసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకే ఆధార్‌ నమోదుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బయోమెట్రిక్‌ పరికరం, ట్యాబ్‌తో పాటు అవసరమైన పరికరాలు సమకూర్చారు. శిశువు చిత్రంతో పాటు తల్లి, తండ్రి బయోమెట్రిక్‌ తీసుకుని వివరాలు నమోదు చేయగానే నంబరు వస్తుంది. దీని ద్వారా ఎక్కడైనా ఆధార్‌ ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్‌ తీసుకోవచ్చు. తల్లి పేరుతో బేబి ఆఫ్‌ మదర్‌ అని నమోదవుతోంది. శిశువుకు పేరు పెట్టిన తర్వాత అదే నంబరుతో ఆధార్‌ను నవీకరించుకునే అవకాశం కల్పిస్తున్నారు.

మొరాయిస్తున్న పరికరాలు

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సిబ్బందికి రెండు ట్యాబ్‌లు ఇవ్వగా.. ఒకటి పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్‌ సమస్య, తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోధన్‌ దవాఖానాలో ట్యాబ్‌లు మొరాయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

సిబ్బందికి శిక్షణ ఇచ్చాం
..ప్రతిమారాజ్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వారితోనే ఆధార్‌ నమోదు చేయిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం.


గతేడాది ఆధార్‌ నమోదు చేసిన వివరాలు..

సెప్టెంబరు 147
అక్టోబరు 344
నవంబరు 300
డిసెంబరు 469
జనవరి(2023) 95


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు