logo

భక్తుల కొంగుబంగారం బడాపహాడ్‌

ఉర్సు ఉత్సవాలకు బడాపహాడ్‌ దర్గా ముస్తాబైంది. సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబా దర్గా వర్ని మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధి బడాపహాడ్‌లో ఉంది.

Published : 02 Feb 2023 03:36 IST

నేటి నుంచి ఉర్సు
న్యూస్‌టుడే, వర్ని

దర్గాకు వెళ్లే మెట్ల మార్గం

ఉర్సు ఉత్సవాలకు బడాపహాడ్‌ దర్గా ముస్తాబైంది. సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబా దర్గా వర్ని మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధి బడాపహాడ్‌లో ఉంది.

చరిత్ర..

నిజాం ప్రభువులు పాలించే కాలంలో నల్గొండ జిల్లాలో సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా తహసీల్దార్‌గా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో అక్కడ కరవు కాటకాలు తాండవించాయి. అలంగిరి జవాన్లకు ప్రజల సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖజానా డబ్బును ప్రజలకు పంచిపెట్టారు. ఆగ్రహించిన జవాన్లు షాదుల్లాను బంధించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామ శివారులో ఉన్న పెద్దగుట్ట ప్రాంతానికి వచ్చారు. అక్కడే ఉంటూ భగవంతుడ్ని ప్రార్థిస్తూ జీవనం సాగించేవారు. పులి, కుక్క, పిల్లి, గుర్రం తదితర జంతువులు ఆయన వెంట ఉండేవి. షాదుల్లా ధ్యానంతో రాళ్ల నుంచి నీరు రావడం, ప్రజలకు మంచి జరగడంతో సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబాగా పేరొందారు. కొన్నేళ్ల తర్వాత ఆయన పెద్దగుట్టపై సమాధి కావడంతో కులమతాలకు అతీతంగా ప్రజలు బాబాను పూజిస్తూ కోరికలు కోరుకునేవారు. అవి నెరవేరడంతో భక్తుల సంఖ్య పెరిగింది.  రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

మూడు రోజులపాటు..

ఏటా  మూడు రోజుల పాటు ఉర్సు   ఉత్సవాలను బడాపహాడ్‌ పుణ్యక్షేత్రంలో చేయడం ప్రత్యేకత. ఉర్దూ కాలమానిని ప్రకారం రజబ్‌ 10 తర్వాత వచ్చే తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాది 2, 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

రామన్నలొంక ఆలయం ప్రసిద్ధి...

బడాపహాడ్‌ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రవేశ ద్వారం దాటిన తర్వాత కుడి వైపున ఉన్న శ్రీ బుగ్గ రామాలయం శ్రీరామన్నలొంకగా కొన్ని శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు బుగ్గ రామాలయాన్ని కులమతాలకు అతీతంగా దర్శించుకుంటారు.  300 సంవత్సరాల క్రితం నంది, శివుని లింగం వెలియడంతో భక్తులు పూజలు జరిపేవారు. పెద్దగుట్ట పైనున్న నవాజ్‌పహాడ్‌లో రాళ్ల మధ్యలో నుంచి ప్రవహించే నీరు నంది, శివలింగం ఉన్న బావి ప్రాంతంలోకి చేరి నీటి బుగ్గలు ఏర్పడేవి. ఆ నీటిని తాగితే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. వేడుకల నిర్వహణకు  వక్ఫ్‌బోర్డు నుంచి రూ.14 లక్షల నిధులు మంజూరయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని