logo

నిర్మించారు.. వదిలేశారు!

గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా గృహాలు నిరుపయోగంగా మారాయి. అప్పటి ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇళ్లను ఎలా నిర్మించాలన్న విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో నమూనా గృహాన్ని నిర్మించారు.

Published : 02 Feb 2023 03:36 IST

న్యూస్‌టుడే, బీర్కూర్‌

బీర్కూర్‌లో  గృహ నిర్మాణ శాఖ నమూనా భవనం

గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా గృహాలు నిరుపయోగంగా మారాయి. అప్పటి ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇళ్లను ఎలా నిర్మించాలన్న విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో నమూనా గృహాన్ని నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో మండలానికొకటి చొప్పున ప్రభుత్వ నిధులను వెచ్చించి భవనాలను నిర్మించారు. వాటిని గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలకు వినియోగించారు. నిర్మాణాలు పూర్తయిన కొన్నేళ్లకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పథకం కొనసాగకపోవడం, సిబ్బంది లేకపోవడంతో నమూనా భవనాలను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. దీంతో ప్రజాధనం వృథా అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భవనాల నిర్వహణ కరవైంది

నమూనా భవనాలను గృహ నిర్మాణ శాఖ సిబ్బంది  వినియోగించుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత భవనాలను పట్టించుకునే వారు కరవయ్యారు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భవనాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారగా మరికొన్ని చోట్ల ఇతర శాఖల వారు కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు.  భవనాలు వృథాగా ఉన్న చోట నిర్వహణ కరవై అస్తవ్యస్తంగా మారింది. చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు భవనాలు శిథిలావస్థకు చేరి దెబ్బతింటున్నాయి.

వినియోగిస్తేనే బాగుంటుంది

నమూనా భవనాలను కొన్ని మండలాల్లో పంచాయతీరాజ్‌, ఐకేపీ, రెవెన్యూ, ఉపాధి శాఖలు తమ అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు సమాచారం.మిగిలిన చోట్ల  వృథాగానే ఉన్నాయి. మండలాల్లో చాలా శాఖలకు సొంత కార్యాలయాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వృథా భవనాలను కేటాయిస్తే  అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని