logo

సీతమ్మ మాట... ఇందూరుకు బాసట

ఆర్థిక మాంద్యం భయాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో కేంద్రం పెద్దగా జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా మౌలిక వసతులు, మహిళా సాధికారతతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది.

Updated : 02 Feb 2023 09:53 IST

కేంద్ర బడ్జెట్‌లో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి - ఈనాడు, నిజామాబాద్‌

ఆర్థిక మాంద్యం భయాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో కేంద్రం పెద్దగా జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా మౌలిక వసతులు, మహిళా సాధికారతతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో మార్పులు చేయడం వేతనజీవులకు ఊరటనిచ్చింది. సహకార మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.

సాగుకు సాయం

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పత్తి సాగును పెంచడంతో పాటు దిగుబడులను విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు ఉద్యాన పంటలు సాగుచేసే వారికి చేయూతనందించనున్నారు. యూరియా మినహా రసాయనిక ఎరువుల ధరలను ఇటీవల పెంచిన నేపథ్యంలో అన్నదాతలకు భరోసా కల్పించేందుకు సేంద్రియ ఎరువులు వినియోగించే వారికి ప్రోత్సాహమిస్తామని ప్రకటించారు.


మహిళా సాధికారత దిశగా..

మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చారు. రెండేళ్ల కాలానికి ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనిద్వారా స్వశక్తి మహిళలు పొదుపు చేసుకుని సాధికారత సాధించే అవకాశం లభించనుంది.


సాంకేతిక గ్రంథాలయాలు

చిన్నారులు, యువత కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. భౌగోళిక, భాషాపరమైన, కళల పరంగా అన్ని స్థాయిల్లో పుస్తకాలు ఉండనున్నాయి. పంచాయతీ, వార్డు స్థాయిల్లో ఫిజికల్‌ డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో యువతకు మెరుగైన గ్రంథాలయ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


వేతన జీవులకు ఊరట

వార్షిక ఆదాయం రూ.ఏడు లక్షల వరకు ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. ఆదాయపు పన్నుల శ్లాబుల్లో మార్పులు చేశారు. రూ.5 - 7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచారు. రూ.ఏడు లక్షలు దాటితే అయిదు శ్లాబుల్లో పన్నులుంటాయని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం చిరు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేదిగా ఉంది. ఎనిమిదేళ్ల కాలంలో మోదీ సర్కారు ఇంత భారీ స్థాయిలో పెంచడం ఇదే మొదటిసారని ఉద్యోగుల నేతలు చెబుతున్నారు.


సొంతింటి కల నెరవేరేలా..

రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలో ఆరు వేల గృహాలు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేశారు. మరో నాలుగు వేలు నిర్మిస్తున్నారు. నిజామాబాద్‌ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రస్తు త బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరే అవకాశం లభించినట్లైంది.


పట్టణీకరణ లక్ష్యంగా..

మొదటిసారి పట్టణాల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో పలు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాక పాలకవర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేంద్రం నిధులు తోడైతే పట్టణాల అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగనుంది.


అనుసంధానం ఊసేలేదు

వ్యవసాయానికి ఉపాధిహామీని అనుసంధానం చేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు సంఘాలు కోరినా కేంద్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా ఉన్న ఈ పథకం తీరుతెన్నులపై ప్రస్తావన రాకపోవడం గమనార్హం.


డిజిటలైజేషన్‌, మార్కెటింగ్‌

సహకార సంఘాలను డిజిటలైజేషన్‌ చేయడంతో పాటు మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సాగుకు అనుబంధంగా ఉండే చేపలు, పశువులు, గొర్రెల పెంపకానికి సహకారం అందించేందుకు గాను కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సంఘాల సభ్యులతో పాటు అన్నదాతలకు కొంత మేర ప్రయోజనం కలగనుంది.


ఉజ్వల మరిచారు

నిరుపేదల(బీపీఎల్‌) మహిళలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రవేశపెట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.

ఉజ్వల కనెక్షన్లు :
- 46465 - 38,425


ప్రణాళికేతర వ్యయాలే ఎక్కువ
- డాక్టర్‌ పున్నయ్య, అర్థశాస్త్ర సహాయ ఆచార్యుడు, తెలంగాణ విశ్వవిద్యాలయం

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రణాళిక వ్యయం ఎక్కువ ఉండేలా రూపొందించాలి. అప్పుడే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోగలం. కానీ ఇందులో ప్రణాళికేతర వ్యయమే ఎక్కువగా ఉంది. నిర్మాణాత్మకంగా కాకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యాలున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చాలాకాలంగా చెప్పారు. ఇప్పుడేమో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఈ రెండు అంశాలు విభిన్నం. ఆదాయపన్ను స్టాండర్డ్‌ డిడెక్షన్‌ 2014 నుంచి రూ.2.5 లక్షలే ఉంది. తొమ్మిదేళ్ల తర్వాత రూ.3 లక్షలకు మార్పు చేశారు. కనీసం రూ.5 లక్షల వరకు ఉంటుందని వేతనజీవులు భావించారు. ఇది పెద్ద మినహాయింపు అని అనలేం.


కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
- డాక్టర్‌ రామ్మోహన్‌రావు, జనవిజ్ఞానవేదిక జాతీయ గౌరవ అధ్యక్షుడు

బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలకు డబ్బులు ఉన్నాయా? ఇదే ప్రధాన ప్రశ్నగా ఉండనుంది. ఉపాధి కల్పన విషయంలో నైపుణ్య శిక్షణ అందిస్తామంటున్నారు. కానీ స్పష్టమైన కార్యచరణ పద్దులో కనిపించలేదు. ఆరోగ్యానికి, విద్యకు చేసిన కేటాయింపులు చాలవు. గ్రీన్‌ గ్రోత్‌ అనే అంశం మంచి ఆలోచనే. మరికొన్ని విషయాలు చేస్తామని ప్రస్తావించారు. అవి ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతాయనేది చూడాలి. అన్నింటికి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలి.


వాణిజ్యానికి సానుకూలం
- దినేష్‌రెడ్డి, అధ్యక్షుడు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిజామాబాద్‌

ఆదాయపన్ను రాయితీ వల్ల రిటైల్‌ మార్కెట్‌ పుంజుకోవచ్చని భావిస్తున్నాం. వస్తుతయారీ రంగానికి డిమాండ్‌ ఏర్పడనుంది. ఒకవేళ మినహాయింపుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకుల్లో పొదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో బ్యాంకులు తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తాయి. వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు అనుకూలతను కలిగిస్తోంది. ఈ చర్యలు కొంత నిర్మాణాత్మకంగానే ఉన్నాయి.


ఉన్నతవిద్యకు ప్రాధాన్యమేదీ?
- డాక్టర్‌ ఆదెప్ప, అర్థశాస్త్రం సహాయ ఆచార్యుడు, గిరిరాజ్‌ కళాశాల

దేశ జీడీపీలో ప్రభుత్వ విద్యకు ఆరుశాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్‌ చాలాకాలం కిందట సూచించింది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు. గత ఎనిమిదేళ్లుగా మూడు శాతంలోపే ఉంటుంది. ప్రాథమిక విద్యలో ఏకలవ్య గురుకులాల ఏర్పాటు మినహా.. మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రస్తావన లేదు. కొత్త విశ్వవిద్యాలయాలు లేవు. డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులోకి తేవడం మంచి అంశమే.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు