logo

బడ్జెట్‌పై తెవివి ఆశలు

‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Published : 03 Feb 2023 06:01 IST

ప్రభుత్వానికి రూ. 140 కోట్ల ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: ‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇందులో బ్లాక్‌గ్రాంట్‌ కింద రూ.73.47 కోట్లు, డెవలప్‌మెంట్‌ కోసం రూ.67.06 కోట్లు పొందుపర్చినట్లు తెలిసింది. మరి సర్కారు కేటాయింపులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.’’


అంతంత మాత్రమే..!

ఏటా బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 2014 ఏడాది నుంచి డెవలప్‌మెంట్‌ గ్రాంట్‌ను కేటాయించడం లేదు. ఫలితంగా యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన మరుగున పడినట్లైందని వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు.


ఇదొక్కటే దిక్కు

గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలకు వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్‌ను మాత్రమే కేటాయిస్తోంది. వీటిని నెలవారీగా విడుదల చేస్తోంది. ప్రతినెల తెవివిలోని రెగ్యులర్‌, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు రూ.2 కోట్లకు పైగా చెల్లింపులు అవుతున్నాయి.


నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాం

డెవలప్‌మెంట్‌ గ్రాంట్స్‌ కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం బడ్జెట్‌లో వేతనాల కోసం మాత్రమే బ్లాక్‌గ్రాంట్‌ కేటాయిస్తోంది. తెవివిలో భవనాల నిర్మాణం కోసం సైన్స్‌, టెక్నాలజీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌, యూజీసీతో పాటు విదేశీ సంస్థల నుంచి నిధులు రాబట్టేలా సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నా.

ఆచార్య రవీందర్‌, తెవివి ఉపకులపతి


భవనాల కొరత

రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్శిటీగా తెవివికి పేరున్నప్పటికీ ఆ స్థాయిలో వసతుల కల్పనకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ఇక్కడ భవనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈసారైనా డెవలప్‌మెంట్‌ నిధులు వస్తే కొన్నింటికైనా మోక్షం లభిస్తుంది.

* సైన్స్‌ కళాశాలకు సొంతగూడు లేదు.
* వర్సిటీ ఆవిర్భవించి 17 ఏళ్లు అవుతున్నా పరీక్షల విభాగానికి ప్రత్యేక భవనం లేకపోవడం గమనార్హం.
* ఇపుడున్న మహిళా వసతి గృహంలో బాలికలు కిక్కిరిసి తలదాచుకుంటున్న దుస్థితి.
* ఆడిటోరియం లేక అంతర్జాతీయ సదస్సులకు ఇబ్బందిగా మారింది. గతేడాది ఓ కాన్ఫరెన్స్‌ను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
* ఇండోర్‌, అవుట్‌ డోర్‌ క్రీడా మైదానాల కొరత ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని