logo

ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తా

జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద విస్తీర్ణంలో పంటలు సాగవుతున్న క్రమంలో ఎరువుల కొరత, విత్తనాల సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.

Published : 03 Feb 2023 06:01 IST

‘ఈనాడు’తో పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు

 

‘‘ఇది వరకు పని చేసిన భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ గిరిజన ప్రాంతాలు. హన్మకొండ ఎక్కువగా అర్బన్‌ ఏరియా ఉన్న జిల్లా. వీటితో పోల్చుకుంటే నిజామాబాద్‌ వేరు. వ్యవసాయాధారితంగా నీటి వనరులు ఉండటం వల్ల.. విభిన్న పంటల సాగుతో ప్రత్యేకతను చాటుకుంటోంది. అన్ని విషయాలు అవగతం చేసుకుంటా. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యాలు నిర్ణయిస్తా. అందుకు అనుగుణంగా కార్యక్రమాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తా. పథకాల కొనసాగింపు కార్యాచరణ సజావుగా సాగేలా చూస్తా. తద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతా. ప్రగతిలో ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తా’’ అని పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘ఈనాడు’తో  మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ఈనాడు, నిజామాబాద్‌ : జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద విస్తీర్ణంలో పంటలు సాగవుతున్న క్రమంలో ఎరువుల కొరత, విత్తనాల సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత యాసంగిలో వరి ఎక్కువగా వేశారు. భారీగా ధాన్యం రానుంది. ఇందుకు అనుగుణంగా వడ్ల సేకరణ ఏర్పాట్లపై దృష్టి పెడతాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థంగా ప్రక్రియ సాగేందుకు చర్యలు తీసుకుంటాం.


ఆయిల్‌పాం విస్తరణకు ప్రోత్సాహం

ప్రస్తుతం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించే కార్యాచరణ కొనసాగుతోంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి దూరంగా ఉన్నాం. నేల స్వభావం... రైతుకు అవగాహన..ఆసక్తితో ముడిపడి ఉన్న అంశమిది. భద్రాద్రి కొత్తగూడెంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి రెండింతలు సాగుకు ముందుకొచ్చారు. అక్కడి పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయి. ఇక్కడ చాలాకాలంగా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తుంటారు. మార్పు అంత సులభం కాదు. పంటతో కలిగే లాభాలను వివరించి లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం.


ఆహార శుద్ధి పరిశ్రమలపై దృష్టి..

జిల్లాలో వరితో పాటు పసుపు, సోయా, మొక్కజొన్న, సెనగ వంటి విభిన్న పంటలు పండుతున్నాయి. వీటికి సంబంధించి ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులోకి రావాల్సి ఉందని తెలుస్తోంది. వీటితో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, పంట ఉత్పత్తికి అదనపు ధర లభించే అవకాశాలుంటాయి. ప్రభుత్వం కూడా ఆహారశుద్ధి పరిశ్రమల జోన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది.


పరీక్షల సన్నద్ధతపై సమీక్షలు..

పరీక్షలు సమీపిస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ విద్యకు సంబంధించి..అవసరమైన చర్యలపై సమీక్షిస్తాం. లోటుపాట్లు లేకుండా చూస్తాం. ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులను ఆదేశిస్తాం. మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి ఉంటారు. వాటిని సమర్థంగా అమలు పర్చేలా సూచనలు చేస్తాం.


కంటి వెలుగుపై నిరంతర పర్యవేక్షణ

కంటి వెలుగు  నడుస్తోంది. కేంద్రాల నిర్వహణపై కార్యక్రమ చివరి రోజు వరకు సమీక్షిస్తాం. నిర్దేశిత పరీక్షలు జరిపి.. పౌరులకు అవసరమైన అద్దాలు అందేలా చూస్తాం. శస్త్రచికిత్సలు అవసరమైన వారి విషయంలో ఆసుపత్రుల్లో సేవలు లభించేలా చర్యలు యంత్రాంగం పరంగా ఇప్పటికే తీసుకున్నాం.


బడుల మరమ్మతుల్లో వేగం పెంచుతాం..

మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. వీటిల్లో వేగం పెంచాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. నామినేటెడ్‌ పద్ధతిలో పాఠశాల నిర్వహణ కమిటీలతో చేసేవి పురోగతిలో ఉన్నాయి. రూ.30 లక్షలకు పైబడిన నిధులతో చేయాల్సిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది.  


ఉపాధి పనుల్లో లక్ష్యాలు సాధిస్తాం..

ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులున్న వారు జిల్లాలో అధికంగా ఉన్నారు. ఎక్కువ మంది పనులకు హాజరవుతున్నారు. పని దినాల లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ అవసరం. మార్చి చివరి వారం నుంచి వరి కోతలు మొదలవుతాయి. జూన్‌లో తిరిగి వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో కూలీలకు గ్రామాల్లో డిమాండ్‌ ఉంటుంది. ఆ సమయంలో వ్యవసాయ కూలి అధికంగా ఉండటంతో ఉపాధిహామీ పనుల హాజరుశాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెలన్నర రోజుల్లోనే ఎక్కువగా పనులు జరిగేలా.. ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా చూస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని