logo

యాభైలో ఒక్కరిగా నిలుద్దాం..

నగరంసన్నద్ధతకు ప్రణాళిక అవసరం: ప్రిలిమ్స్‌తో పోలిస్తే మెయిన్స్‌ చాలా కఠినమైన సవాలేనని చెప్పాలి.

Published : 05 Feb 2023 05:09 IST

ఆ ఒక్క ఉద్యోగం నాదే అనే భావన అవసరం
జూన్‌ 5 నుంచి గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు

మందలో ఒకరిగా ఉండకు... వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు ఇదీ స్వామి వివేకానంద చెప్పిన సూక్తి. ప్రస్తుతం గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో ఒక్క పోస్టుకు యాభై మంది పోటీ పడుతున్నారు. అందులో ఒక్కరిగా నిలవాల్సిన సమయం   ఆసన్నమైంది. పబ్లిక్‌ కమిషన్‌ ఇప్పటికే పరీక్ష తేదీని ప్రకటించింది.

న్యూస్‌టుడే,బోధన్‌ పట్టణం నిజామాబాద్‌: నగరంసన్నద్ధతకు ప్రణాళిక అవసరం: ప్రిలిమ్స్‌తో పోలిస్తే మెయిన్స్‌ చాలా కఠినమైన సవాలేనని చెప్పాలి. ఎందుకంటే ఒక దశలో వడపోత  తరువాత ఎంపికైన అభ్యర్థులంటే పోటీ కచ్చితంగా ఉంటుంది. సన్నద్ధతకు ఒక ప్రణాళిక అవసరం. ఇది ఎప్పటికప్పుడు తమ సాధన, ప్రతిభను మెరుగుపరచుకోవడానికి దోహద పడుతుంది.


వర్తమాన అంశాలు వదలొద్దు: సబ్జెక్టు చదువుతున్నాం కదా అని కరెంట్‌ అఫైర్స్‌ను వదిలేయడానికి వీల్లేదు. వర్తమాన వ్యవహారాలను తెలుసుకోవాలి. వాటిలోని ముఖ్యమైన అంశాలు సబ్జెక్టుకు ఎలా ఉపయోగపడతాయో అన్వయించుకోవాలి. ప్రతి అంశానికి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలి.


పునశ్చరణ:  చదివిన విషయాలను నిత్యం పునశ్చరణ చేసుకోవాలి. అందుకు స్వయంగా సిద్ధం చేసుకున్న నోట్సును ఉపయోగించుకోవచ్చు.


సిలబస్‌ను అనుసరించాలి:  సమయం పరిమితంగా ఉండటంతో సిలబస్‌ను తప్పకుండా అనుసరించాలి. దానికి సంబంధించిన ప్రింట్‌ ఒకటి తీసి పెట్టుకోవాలి. సిలబస్‌లోని ఏయే అంశాలను చదివామన్న విషయం తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది.


నమూనా ప్రశ్నల సాధన: గత, లేదా నమూనా ప్రశ్నల సాధన కీలకమే. వీటితో ఒక అంశంపై ఎంత మేరకు అవగాహన సాధించగలిగామన్నది అవగతమవుతుంది. అందుకే నమూనా ప్రశ్నల  సాధనకు ప్రాధాన్యమివ్వాలి.


లక్ష్యంపై గురి: మానసికంగా దృఢంగా ఉంటూ.. శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్ష్యంపై మాత్రమే గురి పెట్టాలి. ఎక్కడా తడబాటు లేకుండా క్రమశిక్షణ, సమయపాలన, ప్రణాళికాబద్ధమైన చదువుతో అనుకున్న లక్ష్యం సాధించడానికి యత్నించాలి.


చేతి రాతలో వేగం: మనం ఎంత చదివినా.. గరిష్ఠ విషయ పరిజ్ఞానం ఉన్నా.. మెయిన్స్‌ పరీక్షలో నిర్ణీత సమయంలో విషయాన్ని రాయలేకపోతే కష్టమే. అందుకే చదవడంతో పాటు రాయడం సాధన చేయాలి. కొట్టివేతలు లేకుండా, విషయం సూటిగా, స్పష్టంగా ఉండేలా రాయడం ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుంచి సాధన చేసినా కాస్త వేగం పెరుగుతుంది. కంప్యూటర్లు వచ్చాక చేతిరాతకు ఎక్కువ మంది దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తమ చేతిరాత వేగాన్ని పరీక్షించుకోవాలి.


పోలికలు వద్దు : పరీక్ష తేదీపై స్పష్టత రావడంతో లేనిపోని ఆందోళన మొదలవుతుంది. దీనిని వదిలి పెట్టాలి. ఎదుటి వారితో పోలికలు వద్దు. మనతో సాధన చేస్తున్న వారు ఏదైనా అంశంపై చర్చ లేవనెత్తితే.. మనకు ఆ అంశంపై అవగాహన లేకపోతే అయ్యో నాకు  ఆ విషయంపై పట్టు లేదు  అని కంగారు పడొద్దు. ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని ముందుగా  చదవొచ్చు.. లేదా కొందరి అవగాహన స్థాయి వేరుగా ఉంటుంది.   ఈ సమయంలో ఎదుటి వారితో పోల్చి చూసుకొని అనవసరంగా భయపడొద్దు.


అన్ని అంశాలపై అవగాహన ఉండాలి

- జయసుధ, డీపీవో, నిజామాబాద్‌

మేము పరీక్షకు హాజరైన సమయంలో మెయిన్స్‌కు 1:50 ఎంపిక చేశారు. అందులో ఒకరిగా నిలవాలని చేసిన సాధన సత్ఫలితమిచ్చింది. అప్పటి ప్రశ్నపత్రం, తాజా పరీక్షా విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్దేశిత సబ్జెక్టులన్నింటిపై అవగాహన అవసరం. ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు. వర్తమాన వ్యవహారాలపైనా దృష్టి సారించాలి. దినపత్రికలు చదవడం మరవొద్దు. ప్రధానంగా చేతిరాతను మెరుగుపరచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పదాలు రాయగలిగే సామర్థ్యం పెంచుకోవాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని