logo

పోడు.. ముందడుగు

పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం గ్రామసభల నిర్వహణతోనే సరిపెట్టింది.

Published : 05 Feb 2023 05:09 IST

దరఖాస్తుల వడపోతకు కసరత్తు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం గ్రామసభల నిర్వహణతోనే సరిపెట్టింది. అయిదు రోజుల క్రితం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అటవీ, గిరిజనశాఖల అధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ నెలలోనే హక్కుపత్రాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని వెల్లడించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పోడు పరిష్కారానికి అడుగులు వేస్తోంది.


పూర్తయిన గ్రామసభలు

మొదటి దశలో అటవీ హక్కుల కమిటీల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా దరఖాస్తులు తీసుకున్న అధికారులు గ్రామసభలు నిర్వహించి వాటిని పరిశీలించారు. రెండో దశలో ఆర్డీవో నేతృత్వంలోని సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ(ఎస్‌డీఎల్‌సీ)లలో దరఖాస్తుల వడపోత చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్‌సీల ఏర్పాటుతో పాటు జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. తదనంతరం కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని సమావేశ పరిచి దరఖాస్తుల పరిశీలనతో పాటు హక్కుపత్రాల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు.


హక్కుపత్రాలు వచ్చేనా..?

జిల్లాలో రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఉపగ్రహ చిత్రాల సహాయంతో దరఖాస్తుదారుల సమక్షంలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. అధికారుల వద్ద ఉన్న లెక్కలకు, తాజాగా సాగు చేసే భూములకు పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో హక్కుపత్రాల జారీ అవుతాయా.. లేదా.. తేలాల్సి ఉంది.


భారీగా తిరస్కరణ..?

ఉమ్మడి జిల్లాలో 95శాతం అనర్హులే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇప్పటికే నిర్వహించిన గ్రామసభలు, క్షేత్రస్థాయి పర్యటనలో చాలామంది వద్ద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి రికార్డులు లేనట్లు తేలింది. ఇక గిరిజనేతరుల వద్ద మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నట్లు నిరూపించే ఆధారాలు లేనట్లు తేలింది. పలువురు గిరిజన రైతుల పేరిట పట్టా భూములున్నట్లు నిర్ధారించారు. సబ్‌ డివిజనల్‌ కమిటీల్లోనూ దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో స్క్రూటినీ నిలిపివేసినట్లు వెల్లడించారు.


ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన

- అంబాజీ, గిరిజన సంక్షేమాధికారి, కామారెడ్డి

పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు తీసుకున్నాం. వాటిని గ్రామసభల్లో హక్కుల కమిటీ సభ్యుల సమక్షంలో పరిశీలించాం. ప్రస్తుతం సబ్‌ డివిజనల్‌ కమిటీల ఆధ్వర్యంలో స్క్రూటినీ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేసి కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీకి నివేదిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని