logo

మృత్యుగోదారి

‘‘నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల సరిహద్దులో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.’’ 

Published : 06 Feb 2023 05:49 IST

నది పరిసరాల్లో పెరుగుతున్న బలవన్మరణాలు
రక్షణ చర్యలు చేపట్టని యంత్రాంగం
న్యూస్‌టుడే, నవీపేట

నిజామాబాద్‌ - నిర్మల్‌ జిల్లాల సరిహద్దులో బాసర వద్ద నిర్మించిన వారధి

‘‘నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల సరిహద్దులో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.’’

‘‘ఇటీవల ఈ ప్రాంతంలో బలవన్మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వివిధ కారణాలతో నదిలో దూకి వారి కుటుంబాల్లో తీరని శోకం నింపుతున్నారు.’’

నవీపేట మండలం యంచ వంతెన వైపు మూడేళ్లల్లో 21 మంది, బాసర వైపు కేవలం ఆరు నెలల్లోనే 42 మంది నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారధి బలవన్మరణాలకు కేంద్రంగా మారడంపై సమీప గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఘటన వినాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంచెతో కొంతమేలు

వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలకు ఎత్తైన కంచెతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలను కొంత వరకైనా నివారించే అవకాశముంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని యంచ వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల మంత్రి, కలెక్టర్‌, సీపీకి విన్నవించారు.

మత్య్సకారులే దిక్కు

నదిలో దూకిన వారిని కొన్ని సందర్భాల్లో జాలర్లు గమనించి కాపాడుతున్నారు. ఆ సమయంలో బాధిత కుటుంబ సభ్యులకు పెద్దదిక్కవుతున్నారు. ఏడాది క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ యువతిని ఇలా వీరు కాపాడటం గమనార్హం. మరో ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి నీటిలో దూకగా.. యంచ మత్స్యకారులు పిల్లల ప్రాణాలను మాత్రం రక్షించగలిగారు. బాధితులను కాపాడేందుకు ఇక్కడ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


తగిన చర్యలు తీసుకుంటాం
- నరహరి, సీఐ, నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌

గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవుట్‌పోస్టు తరహాలో నిఘా పెంచాలనే ఆలోచన ఉంది. త్వర లో పూర్తిస్థాయి కార్యాచరణ అమలు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని