logo

తరుగుకు చెక్‌..

రేషన్‌ బియ్యం తరుగుకు చెక్‌ పడనుంది. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజాపంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

Published : 06 Feb 2023 05:49 IST

రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌
ఈ నెల నుంచే అమల్లోకి..

గత నెలలో ఎంఎల్‌ఎస్‌ కేంద్రం నుంచి రేషన్‌ దుకాణానికి వచ్చిన సంచి బరువు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: రేషన్‌ బియ్యం తరుగుకు చెక్‌ పడనుంది. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజాపంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల నుంచే రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. డీలర్లు ప్రతి నెల మండల స్థాయి గిడ్డంగికి వెళ్లి తన దుకాణంలోని కార్డుల ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 578 రేషన్‌ దుకాణాలకు ఈ నెల నుంచి బయోమెట్రిక్‌ ఆధారంగా పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

దోపిడీపై ఫిర్యాదులు

జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్‌ ఏడు కేంద్రాల నుంచి అన్ని రేషన్‌ దుకాణాలకు బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు. ప్రతి నెల తక్కువగా వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 50 కిలోల బస్తాలో 44- 49 కిలోలే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. మండలస్థాయి గోదాముల్లో గన్నీ సంచులకు కావాలని రంధ్రాలు చేసి బియ్యం కిందపడిపోయే విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం డీలర్లకూ బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు అందులో వేలిముద్ర వేసినప్పుడు ఈ-పాస్‌కు వేయింగ్‌ యంత్రానికి ఎలా అనుసంధానం చేశారో.. అదే విధంగా ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. గతంలో పాఠశాలలకు బియ్యం సరఫరా చేసినప్పుడు తూకం తక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రధానోపాధ్యాయులకు ఇదే విధానం అమలు చేశారు. హెచ్‌ఎంలు ఎంఎల్‌ఎస్‌ కేంద్రాలకు వెళ్లి రావడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సీఆర్పీలకు బయోమెట్రిక్‌ అప్పగించారు.

సాంకేతిక చిక్కులు

ఇందులో కొన్ని సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 578 రేషన్‌ దుకాణాలు ఉండగా అందులో 90 చోట్ల డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర డీలర్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కొందరికి రెండు, మూడు కేటాయించారు. చాలాచోట్ల బినామీ డీలర్లు దుకాణాలు నడుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఎంఎస్‌ఎస్‌ కేంద్రాల నుంచి బియ్యం సరఫరా చేయాలని భావిస్తే ఎవరు తీసుకుంటారో వేచిచూడాలి.  


ఆనందంగా ఉంది
- రాజు, రేషన్‌డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల బియ్యం తూకం తక్కువగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొత్త విధానంతో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నా.


గిడ్డంగికి వెళ్లాల్సిందే..
- పద్మ, డీసీఎస్‌ఓ, కామారెడ్డి

ప్రక్రియ ప్రారంభించాం. కొన్ని సాంకేతిక ఇబ్బందులు అధిగమించి ముందుకెళ్తాం. ముందునుంచే డీలర్లను ఎంఎల్‌ఎస్‌ కేంద్రాలకు వచ్చి తూకం సరిగా ఉందో లేదో చూసుకోవాలని సూచిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వమే అమలు చేయడంతో ఇక తప్పకుండా మండలస్థాయి గిడ్డంగికి వెళ్లాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని