logo

Telangana Budget 2023: ఆశల ఊసులు

శాసనసభలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ప్రజల్లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో  అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలున్నాయి. విద్యారంగానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు.

Updated : 06 Feb 2023 09:26 IST

నేడే రాష్ట్ర బడ్జెట్‌
కేటాయింపులపై  ఆసక్తి
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

శాసనసభలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ప్రజల్లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో  అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలున్నాయి. విద్యారంగానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. మన ఊరు.. మన బడి పథకం పనులు పూర్తి చేసేందుకు కాసుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

కామారెడ్డి- ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్యాకేజీ-22కి నాలుగేళ్లుగా నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. 20, 21 ప్యాకేజీలకు రూ.286 కోట్లు అవసరం. నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ జలాశయాలకు ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా 10 శాతమైనా కేటాయింపులకు నోచుకోవడం లేదు. నిజాంసాగర్‌ ఆయకట్టుకు సాగు నీరందించే కాల్వలు శిథిలావస్థకు చేరాయి. ఫీల్డ్‌ఛానళ్లు కనుమరుగయ్యాయి. వీటి పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రధాన కాల్వ ఆధునికీకరణకు ఆమోదం తెలిపినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.


విశ్వవిద్యాలయం..

తెవివికి రూ.140 కోట్లు    కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. ఇందులో బ్లాక్‌గ్రాంట్‌ కింద రూ.73.47 కోట్లు, అభివద్ధి కోసం రూ.67.06 కోట్లు కావాలని అందులో పొందుపరిచారు.   కొన్నేళ్లుగా అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. ఫలితంగా విశ్వవిద్యాలయంలో నూతన   భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన కరవైందని   విద్యార్థులు, ఉద్యోగులు వాపోతున్నారు.


నగర, పురపాలికలపై  దృష్టి పెట్టేనా..

ఉభయ జిల్లాల్లో 1 నగరపాలకసంస్థ, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రగతి కింద రూ.6 కోట్ల మేర కేటాయిస్తున్నా.. సకాలంలో రాక అభివృద్ధి కుంటుపడుతోంది. పట్టణాల పరిధి పెరుగుతోంది. దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అవసరం. నిజామాబాద్‌, కామారెడ్డిలో ఆస్తి, కుళాయి పన్ను రూపేణా రూ.82.15 కోట్లు సమకూరుతున్నా ఇవే మూలకూ సరిపోవడంలేదు.


విద్యుత్తు లోటు తీర్చేందుకు

వ్యవసాయ కనెక్షన్లు, ఉపకేంద్రాల ఏర్పాటు తదితర అవసరాలకు నిధులు కేటాయించాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో తీగల మార్పు, నియంత్రికల ఏర్పాటుకు రూ.75 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా.


అసంపూర్తిగా  మన ఊరు మన బడి

మన ఊరు మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల వసతులను యంత్రాంగం సమకూర్చుతోంది. వీటిలో మరుగుదొడ్లు, వంటగదులు, ప్రహరీలు, అదనపు గదుల ఏర్పాటు, భవనాల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఉభయ జిల్లాల్లో 856 బడులను ఈ పథకం కింద ఎంపిక చేయగా.. పూర్తిస్థాయిలో నిధులు మంజూరుకాక ఆపసోపాలు తప్పడం లేదు. ఇటీవల కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 22 బడులనే ప్రారంభించారు. మిగతా పనులు పూర్తిచేయడానికి రూ.378 కోట్లు అవసరం.


వైద్యం  మెరుగయ్యేనా..?

రెండు జిల్లాల్లో 226 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో వైద్యులు, మల్టీపర్పస్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించారు. ఇందులో 50 శాతం వరకు పీజీ కోర్సుల్లో చేరడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటి భర్తీతోపాటు పక్కా భవనాలు నిర్మించాల్సి ఉంది. ఆరోగ్య ఉపకేంద్రాల మరమ్మతులు చేపట్టాలి. నిజామాబాద్‌  బోధన ఆసుపత్రిలో వసతుల మెరుగునకు నిధులు అవసరం. కామారెడ్డి మాతాశిశుసంరక్షణ కేంద్రాన్ని రూ.20 కోట్లతో చేపడుతున్నారు. ఈ నిధులు విడతలవారీగా రావడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. వైద్యకళాశాల భవనానికి ఇప్పటికే రూ.236 కోట్లు కేటాయించారు. నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉభయ జిల్లాల్లోని డయాలసిస్‌ కేంద్రాల్లో మరో 50 పడకల పెంపునకు నిధుల ఆవశ్యకత ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని