logo

రైతు నేస్తం

శాసనసభలో సోమవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సాగుకు ప్రోత్సాహం అందించేలా సంక్షేమానికి చేయూతనిచ్చేలా ఉంది.

Published : 07 Feb 2023 04:47 IST

సాగుకు దన్ను.. జల వనరులకు పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్‌లో బడుగులకు భరోసా
ఈనాడు డిజిటల్‌ కామారెడ్డి, ఈనాడు నిజామాబాద్‌

శాసనసభలో సోమవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సాగుకు ప్రోత్సాహం అందించేలా సంక్షేమానికి చేయూతనిచ్చేలా ఉంది.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసేలా నిధులు కేటాయించడంతో ఆయా వర్గాలు అత్యధికంగా కలిగిన ఉభయ జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కాళేశ్వరం ప్యాకేజీ-20, 21, 22పై ఆశలు చిగురించాయి.


కర్షక హితం

రుణమాఫీ అమలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అన్నదాతలకు లబ్ధిచేకూరే అంశం. స్థానికంగా చెరకు పంట ఏటేటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పాంను ప్రోత్సహించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించడం శుభపరిణామం. ఉభయ జిల్లాల్లో దీని సాగుకు సమాయత్తమవుతున్న సుమారు పదిహేను వేల మంది మెట్టప్రాంత రైతులకు మేలు జరగనుంది.


నేరుగా స్థానిక సంస్థలకు  నిధులు

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా విడుదల చేస్తోంది. ఇదే మాదిరిగా పురపాలికలతో పాటు పంచాయతీలకు పల్లె, పట్టణ ప్రగతితోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలు, బల్దియాల ఖాతాల్లో వేయనున్నట్లు మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో నిధుల కొరత తీరే అవకాశముంది.
పురపాలికలు :  - 4 - 3


గోదావరి జలాల తరలింపునకు కసరత్తు

కాళేశ్వరం నుంచి నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 తీసుకొచ్చారు. నిజామాబాద్‌లో ప్యాకేజీ-21ని వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్యాకేజీ-21, -21(ఎ)గా విభజించి పనులు చేపడుతున్నారు. కామారెడ్డి, మెదక్‌ కోసం ప్యాకేజీ-22 కొనసాగుతోంది. ప్రస్తుత బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా.. వీటి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటేనే అన్నదాతల ఆశలు నెరవేరే అవకాశముంది.


అనుబంధ నర్సింగ్‌ కళాశాల

కామారెడ్డి వైద్య కళాశాలలో రాబోయే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బాన్సువాడలో నర్సింగ్‌ కళాశాల ఉంది. గతేడాది తరగతులు ప్రారంభమయ్యాయి. తాజాగా మరోటి రానుంది.


నెరవేరనున్న సొంతింటి కల

రెండు పడక గదుల ఇళ్లకు భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టే వారికి రూ.3 లక్షలు మంజూరు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బడ్జెట్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ గతేడాది వెల్లడించినందున ఈ పథకానికి మోక్షం లభించే అవకాశం ఉంది. తద్వారా నిరుపేదల గృహ కల నెరవేరనుంది.


ఒప్పంద క్రమబద్ధీకరణ, సెర్ప్‌ పేస్కేల్‌ సవరణ

ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సెర్ప్‌ సిబ్బంది పేస్కేల్‌ సవరణ చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఉభయ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 5,327 మందికి ప్రయోజనం కలగనుంది.


దళిత యువతకు ఉపాధి

అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈమేరకు దళితబంధు ప్రవేశపెట్టి నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని మొత్తం దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకం అమలుకు రూ.17,700 కోట్లు కేటాయించడంతో సదరు కుటుంబాల్లో ఆశలు నెలకొన్నాయి.


మన ఊరు మన బడి

మన ఊరు-మన బడికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఉభయ జిల్లాల్లోని 758 బడుల్లో మౌలిక వసతుల కల్పన నిమిత్తం  ఎంపిక చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు పూర్తికావడం గమనార్హం.


కొత్త ఈహెచ్‌ఎస్‌  విధానం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులను భాగస్వాములుగా చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని