logo

సామాజిక సేవకు ఒక రోజు

ఇలా కేరళ విద్యాలయాల్లో తీసుకొచ్చే వినూత్న కార్యక్రమాలు నిత్యం దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి నెలా మొదటి సోమవారం అక్కడ చేపట్టే సామాజిక సేవా దినోత్సవం చర్చనీయాంశమవుతోంది.

Updated : 08 Feb 2023 06:11 IST

వంద మంది విద్యార్థులతో ఓ పేద కుటుంబం దత్తత
కేరళ అలప్పుజ జిల్లాలో వినూత్న కార్యక్రమం
ఇక్కడా అమలుకు ఆలోచిస్తే బాగు
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

మొన్న

స్టూడెంట్‌ పోలీసు కేడెట్‌.. శాంతి భద్రతల పరిరక్షణలో విద్యార్థి పోలీసు కార్యక్రమం

నిన్న

బడిలో నీటి గంట.. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా తరగతుల మధ్య నీళ్లు తాగేలా పది నిమిషాల పాటు విరామం

నేడు

పేదరిక నిర్మూలనకు సామాజిక సేవా దినోత్సవం అంటూ ప్రతి నెల మొదటి సోమవారం విద్యార్థుల నుంచి నిత్యావసరాల సేకరణ.

ఇలా కేరళ విద్యాలయాల్లో తీసుకొచ్చే వినూత్న కార్యక్రమాలు నిత్యం దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి నెలా మొదటి సోమవారం అక్కడ చేపట్టే సామాజిక సేవా దినోత్సవం చర్చనీయాంశమవుతోంది. తాజాగా అలప్పుజ జిల్లా కలెక్టర్‌ వీఆర్‌ కృష్ణతేజ ఆధ్వర్యంలో ‘చిల్డ్రన్స్‌ ఫర్‌ అల్లెప్పీ- ఒరు పిడి నమ్న’ అనే పేరుతో ఓ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమైంది.

ఆచరణీయం..

తాజాగా ఈ విధానాన్ని తెలుసుకొని ఉభయ జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ అమలు చేస్తే విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించవచ్చు. పేదల కష్టాలు అర్థం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. నేటి తరం పిల్లల్లో బాధ్యత కొరవడుతుందనే అపవాదును రూపుమాపాలంటే ఓ చిన్న ప్రయత్నంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి.

చక్కటి  ఉదాహరణ..

ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థతో ఉచిత బియ్యం అందిస్తోంది. కానీ నిత్యావసర వస్తువులను అందించే పథకాలేవి లేవు. వాటిని సమాజం సమకూరిస్తే కొద్ది రోజుల్లో ఆ కుటుంబం కాస్త ఆర్థికంగా కుదుటపడే ఆస్కారముంటుంది. అలా దశలవారీగా ఇలాంటి సాయం అందిస్తే పేదరిక నిర్మూలనకు బీజం పడినట్లేనని ఈ కార్యక్రమంపై స్పందన వస్తోంది. ఒక సబ్బు, ఒక టూత్‌ పేస్టు... ఇలా మనిషికో వస్తువు ఆర్థికంగా భారం కాదు. అదే వీటన్నింటిని కొనాలంటే రూ.వందల్లో ఖర్చవుతుంది. ఈ ఖర్చునే పిల్లలు తమ పాకెట్‌ మనీ నుంచి వెచ్చిస్తే సులభంగా పేదలకు చేయూత అందుతుంది. మన దగ్గర కొన్ని సంస్థలు, సంఘాలు కార్యక్రమాలు నిర్వహించినా.. నిరంతరం, ఒక వ్యవస్థగా నిర్వహిచండంలేదు. మంచి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి ఇదో చక్కటి ఉదాహరణ.

ఇదీ కార్యక్రమం..

ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో విద్యార్థులతో సామాజిక క్లబ్బు ఏర్పాటు చేస్తారు. వంద మంది విద్యార్థులు కలిసి ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి. అర్హులైన 3,613 పేద కుటుంబాలను ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి గుర్తించింది. సేవకు ముందుకొచ్చిన బడిలో ప్రతి నెలా మొదటి సోమవారం ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల సహకారంతో సామాజిక సేవా దినోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు విద్యార్థుల నుంచి నగదు, బియ్యం మినహా.. పప్పులు, సబ్బులు, పిండి, ఔషధాలు సహా ఇతర నిత్యావసర వస్తువులు విరాళంగా సేకరించి దత్తత తీసుకున్న కుటుంబాలకు సమానంగా అందించేలా ప్యాకింగ్‌ చేసి పంపిణీ చేస్తారు. సమన్వయకర్తగా ఉపాధ్యాయుడు, నాయకుడిగా విద్యార్థి నడిపిస్తారు. పేదల వివరాలు గోప్యంగా ఉంచుతారు. కొన్ని బడుల్లో 50 మంది పిల్లలు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు.

3 వేల కుటుంబాలకు సాయం

ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 4 లక్షల మంది పాఠశాల స్థాయి విద్యార్థులున్నారు. 3 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బడులున్నాయి. పాఠశాలకు ఒక పేద కుటుంబాన్ని దత్తత ఇచ్చినా జిల్లాలో దాదాపు 3 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. సాయం అందించడానికి అర్హులు, వారి అవసరాలను గుర్తించి అమలు చేయాలి. ప్రస్తుతం పది విద్యార్థులు ప్రత్యేక తరగతుల్లో కూర్చుంటున్నారు. వారికి సాయంత్రం అల్పాహారం అందించడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇది అత్యంత కీలకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని