logo

సాగు బాగుకు.. అరకొర నిధులే

జలాశయాల కింది కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీ, ఉప కాల్వల మరమ్మతులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది.

Published : 08 Feb 2023 05:40 IST

నిజాంసాగర్‌ ఆధునికీకరణకు రూ.146.51 కోట్లు
మిగతా వాటికి రిక్తహస్తం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

నిజాంసాగర్‌ ప్రాజెక్టు

జలాశయాల కింది కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీ, ఉప కాల్వల మరమ్మతులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. కేవలం నిజాంసాగర్‌ ఆధునికీకరణకు రూ.146.51 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి.. కాళేశ్వరం పనులు పూర్తి చేస్తామని ప్రస్తావించడంతోనే సరిపెట్టారు. ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో పనుల పూర్తికి నిర్దిష్ట కార్యాచరణ కొరవడింది. గోదావరి జలాలతో జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరిస్తామని నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.

పోచారం

భారీగా ప్రతిపాదనలు: ఈ ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిజాంసాగర్‌ కాల్వల ఆధునికీకరణతో పాటు డ్యాం మరమ్మతులకు రూ.380 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. పోచారం కాల్వల ఆధునికీకరణకు రూ.100 కోట్లు, కౌలాస్‌కు రూ.43 కోట్లు అవసరమని నివేదించారు. వీటితో పాటు కాళేశ్వరం ప్యాకేజీ-22 పనుల పూర్తికి రూ.1,340 కోట్లు ఇవ్వాలని కోరారు.

నిర్వహణకే సరిపోవు : జలవనరుల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి జిల్లాను నిజామాబాద్‌, కామారెడ్డిగా వర్గీకరించి సీఈలను నియమించారు. కామారెడ్డి జిల్లా సీఈ పరిధిలోకి నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌తో పాటు సింగీతం, కల్యాణి వంటి రిజర్వాయర్లు, నిర్మాణంలో ఉన్న లెండి ప్రాజెక్టును చేర్చారు. ప్రస్తుతం వీటి నిర్వహణకు గతానికి భిన్నంగా కేవలం రూ.5 కోట్లే కేటాయించారు.

భూసేకరణ దశలోనే : నిజామాబాద్‌ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు కాళేశ్వరం నీరందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. మెట్ట ప్రాంతమైన కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించేందుకు ఉద్దేశించిన 22-ప్యాకేజీ పనులు ఇంకా పూర్తికాలేదు. నిధుల విడుదల్లో జాప్యం కారణంగా ప్యాకేజీ-22 పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాల్వల తవ్వకాలతో పాటు ఇతర పనులకు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టాల్సింది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పనులు సాగడం లేదు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయితేనే ప్రయోజనం చేకూరుతుంది.

కౌలాస్‌నాలా

పోచారం ఎత్తు పెంపు ఉత్తిదే

2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్‌ పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తానని హమీ ఇచ్చారు. గతఏడాది బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులు చేశారు. ప్రస్తుతం రూ.3.50 కోట్లు ఇచ్చినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవు. ఎత్తుపెంపుపై సర్వే చేపట్టేందుకు రూ.33 లక్షలు మంజూరు చేయాలని అధికారులు నివేదించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. దీనికి తోడు వందేళ్ల కిందట నిర్మించిన ప్రాజెక్టు కావడంతో డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు శిథిలావస్థకు చేరాయి. రైతులే డబ్బులు వెచ్చించి బాగు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని