logo

చదువుకోవడానికి స్థలమివ్వరూ..

ఈ చిత్రంలో ఉన్నది పాత డీఈవో కార్యాలయ భవనం. కొత్త కలెక్టరేట్‌కు దీన్ని తరలించడంతో భవనం వృథాగా ఉంటుంది. పఠనాలయానికి సమీపంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంగణాన్ని తాత్కాలికంగానైనా తమకు కేటాయించాలని గ్రంథాలయ అధికారులు కోరుతున్నారు.

Published : 08 Feb 2023 05:40 IST

రద్దీగా జిల్లా కేంద్ర గ్రంథాలయం
సమీపంలోనే వృథాగా ఉన్న పాత డీఈవో కార్యాలయం

ఈ చిత్రంలో ఉన్నది పాత డీఈవో కార్యాలయ భవనం. కొత్త కలెక్టరేట్‌కు దీన్ని తరలించడంతో భవనం వృథాగా ఉంటుంది. పఠనాలయానికి సమీపంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంగణాన్ని తాత్కాలికంగానైనా తమకు కేటాయించాలని గ్రంథాలయ అధికారులు కోరుతున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు స్పందించి సమస్యను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.


నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని చిత్రమిది. వరుసగా పోటీ పరీక్షలకు ప్రకటనలు విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు నగరంలో అద్దెకు ఉంటూ పఠనాలయానికి వస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు వస్తేనే కుర్చీ దొరుకుతుంది. అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు. ఇబ్బందుల మధ్య చివరికి మెట్లపై కూడా కూర్చుని చదువుతున్నారు.

బస్టాండ్‌కు, రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే ఉండటం సానుకూల అంశం. రోజు 500 మంది వరకు హాజరవుతున్నారు. వీరికోసం నాలుగు గదులు కావాల్సి ఉంది. మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. కాగా దీన్ని ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు.


మరొకసారి విన్నవిస్తాం : బుగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

పాత డీఈవో కార్యాలయం విషయంపై గతంలోనే ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. మరొకసారి పాలనాధికారి దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. కొత్త భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాం.


ఇబ్బందులు పడుతున్నాం: సాయిబాబు, ఎరాజ్‌పల్లి

పోలీసు, గ్రూప్స్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నా. ఉదయం 5 గంటల్లోగా వస్తేనే కుర్చీలు దొరుకుతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో పాత డీఈవో కార్యాలయాన్ని కేటాయిస్తే బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని