logo

యువతరం.. సేవాపథం

చదువు..ఉద్యోగం..సంపాదన అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నేటి యువతకు సమాజసేవ చేసే అవకాశం కల్పిస్తుంది జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌).

Published : 24 Mar 2023 06:13 IST

గుండారంలో తడి, పొడి చెత్త గురించి వివరిస్తున్న వాలంటీర్లు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వినాయక్‌నగర్‌: చదువు..ఉద్యోగం..సంపాదన అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నేటి యువతకు సమాజసేవ చేసే అవకాశం కల్పిస్తుంది జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌). సంబంధిత వాలంటీర్లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల వాలంటీర్లు ఈనెల 25 నుంచి 31 వరకు సిర్పూర్‌, గుండారం, ముత్యంపల్లి, ఒడ్యాట్‌పల్లి, మాదాపూర్‌, మోపాల్‌ గ్రామాల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో శిబిరాల్లో పాల్గొన్నవారి అనుభవాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.


వీరు చేసే కార్యక్రమాలు

ఏటా నిర్వహించే శిబిరాల్లో శ్రమదానం, రక్తదానం, అక్షరాస్యత, స్వచ్ఛభారత్‌, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వాననీటి సంరక్షణ, ఓటు హక్కు నమోదు, సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది కొత్తగా నిరుద్యోగితపై సర్వే నిర్వహించనున్నారు. చివరిగా ఇంటింటి సర్వే చేసి పల్లెల్లోని సమస్యలు ఇతర అంశాలను తెలుసుకుంటారు.


సేవే ముఖ్య ఉద్దేశం
శ్రీజ జాదవ్‌, బీఎస్సీ, బీటీజడ్‌సీ తృతీయ సంవత్సరం

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే ఎన్‌ఎస్‌ఎస్‌ ముఖ్య ఉద్దేశం. సమాజ సేవే కాకుండా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇది వేదికగా నిలుస్తుంది. ఏడాదిన్నరగా ఇందులో కొనసాగుతున్నాను. రెండుసార్లు నేషనల్‌ యూత్‌ పార్లమెంటులో రాష్ట్రస్థాయి వరకు వెళ్లాను. జిల్లా ఉత్తమ వాలంటీరుగా ఎంపికయ్యాను. ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసంగించడానికి ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా అవకాశం దక్కింది.


రెండేళ్లుగా కొనసాగుతున్నా
కల్యాణ్‌, బీకాం తృతీయ సంవత్సరం

రెండేళ్లుగా వాలంటీరుగా కొనసాగుతున్నాను. పాటలు, నాటకాల రూపంలో ఆయా అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చేశాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపుర్‌లో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ క్యాంప్‌లో పాల్గొన్నా. అక్కడ మాదకద్రవ్యాల నివారణ, చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాటకం ద్వారా వివరించాం.


కొత్త విషయాలు తెలుసుకున్నా
ప్రియవర్ధన్‌, బీఏ  ద్వితీయ సంవత్సరం

ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా సమాజాభివృద్ధికి నా వంతు కృషి చేశాను. గ్రామాల్లో పర్యటించినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నా. జాతీయ శిబిరాలకు వెళ్లడం ద్వారా వ్యక్తిత్వ వికాస, నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. గతేడాది నవంబర్‌లో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన నేషనల్‌ అడ్వెంచర్‌ శిబిరానికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున హాజరయ్యాను.


క్రమశిక్షణ అలవడుతుంది
శాంతికుమార్‌, బీఏ తృతీయ సంవత్సరం

ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవడుతుంది. శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించడం అలవాటుగా మారుతాయి. గతేడాది నవంబర్‌లో గుజరాత్‌లో నిర్వహించిన ప్రీరిపబ్లిక్‌ శిబిరంలో నా ప్రదర్శనకు ప్రశంసలు రావడం సంతోషంగా అనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని