logo

స్వీయ మదింపు.. అక్రమాలు నింపు

జిల్లాకేంద్రంలోని సైలాన్‌బాబాకాలనీకి చెందిన అక్బర్‌ అనే యజమాని ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టారు. పురపాలక పోర్టల్‌లో స్వీయ మదింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Published : 24 Mar 2023 06:16 IST

నిర్మాణాల్లో నిబంధనలకు తిలోదకాలు
ఉమ్మడి జిల్లాలో 1509 దరఖాస్తుల తిరస్కరణ
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

కామారెడ్డి పట్టణం

జిల్లాకేంద్రంలోని సైలాన్‌బాబాకాలనీకి చెందిన అక్బర్‌ అనే యజమాని ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టారు. పురపాలక పోర్టల్‌లో స్వీయ మదింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయికి వచ్చిన బల్దియా సిబ్బంది నిర్మాణాన్ని చూసి కంగుతిన్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన వివరాలకు స్థానిక పరిస్థితులకు పొంతనే లేకపోవడంతో దరఖాస్తును తిరస్కరించారు.


కామారెడ్డిలోని గాంధీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన పత్రాల్లో తప్పులు దొర్లాయి. ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రం లేదు. పైగా నిర్మాణం చేపట్టిన చోట నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ఆన్‌లైన్‌లో మాత్రం సవ్యంగా చేపట్టామని నివేదించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్వీయ మదింపు దరఖాస్తును తిరస్కరించారు.


భవన నిర్మాణాలకు సంబంధించిన స్వీయ మదింపు అక్రమాలకు నిలయంగా మారింది. పురపాలకశాఖకు సమర్పించిన వివరాలకు, క్షేత్రస్థాయిలో కట్టిన దానికి పొంతన ఉండటం లేదు. గతంలో నిర్మించిన చోటకు బిల్‌కలెక్టర్లు వచ్చి కొలతలు తీసుకునేవారు. ప్రస్తుతం పురసేవలను సులభతరం చేయడంలో భాగంగా స్వీయ మదింపునకు అవకాశం ఇవ్వడంతో యజమానులు తప్పిదాలకు తావిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన 2020 అక్టోబరు23 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1509 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

పారదర్శకత కోసమే

నగర, పురపాలికల్లో పారదర్శకత కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తున్నారు. చరవాణి ఉంటే చాలు బల్దియాకు వినతిపత్రం సమర్పించేందుకు ప్రత్యేక యాప్‌లను అందుబాటులో తెచ్చారు. స్వీయ మదింపు ప్రక్రియ అందుబాటులోకి వచ్చాక కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. తాము ఎలా నిర్మించుకున్నా దర్జాగా అనుమతులు వచ్చేస్తాయని భావిస్తున్నారు. సిబ్బంది నిర్మించిన చోటకు వెళ్లి సమగ్ర వివరాలు పరిశీలిస్తుండటంతో లోపాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించిన దరఖాస్తులను తిరస్కరించారు.

భారీగా జరిమానాలు

స్వీయ మదింపులో తప్పిదాలకు తావిచ్చిన వారికి పురపాలకశాఖ భారీగా జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పన్నుపై 25- 100 శాతం వరకు అదనంగా విధించే అధికారం కల్పించారు. ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టినవి ఆస్తి పన్ను పరిధిలోకి రాలేదు. దీంతో నగర, బల్దియాల ఆదాయానికి గండి పడుతోంది. పురపాలక రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే సత్ఫలితాలు ఆశించే వీలుంది.


సవ్యంగా ఉంటేనే అనుమతి
- జానయ్య, ఆర్‌ఐ-కామారెడ్డి బల్దియా

పురపాలికల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి ఆస్తిపన్ను మదింపు కోసం స్వీయ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అన్ని సవ్యంగా ఉంటేనే అనుమతిస్తున్నాం. ప్రమాణాలు పాటించని వాటిని తిరస్కరిస్తున్నాం. ఆ నిర్మాణాలపై భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని