logo

రూ.3 కోట్లకు పైగా ముంచాడు

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుటుంబంలోనూ ఉద్యోగులున్నారు. చిన్నపాటి వ్యాపారాలు, అద్దెకిచ్చేందుకు మడిగెలు ఉన్నాయి. ఇంకేం అంతా నమ్మారు.

Published : 29 Mar 2023 06:19 IST

బంధువులు, స్నేహితులవద్ద అప్పు చేసి పరారీ
నందిపేట్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం
న్యూస్‌టుడే, ఆర్మూర్‌

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుటుంబంలోనూ ఉద్యోగులున్నారు. చిన్నపాటి వ్యాపారాలు, అద్దెకిచ్చేందుకు మడిగెలు ఉన్నాయి. ఇంకేం అంతా నమ్మారు. స్నేహితులు, బంధువులు ఒకరికి తెలియకుండా మరొకరు రూ.లక్షలు ఆయన చేతిలో పెట్టారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడి పెడుతున్నాడేమోనని భావించారు. తీరా చూస్తే ఆయన ఆచూకీ లేదు. డొంకేశ్వర్‌ మండలం దత్తాపూర్‌కు చెందిన సదరు ఉద్యోగి కొన్నాళ్లుగా నందిపేట్‌ మండల కేంద్రంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గ్రామంలో స్నేహితులు, బంధువులను మభ్యపెట్టాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అప్పుగా తెచ్చుకున్నాడు. మొదట్లో వడ్డీ సక్రమంగా కట్టడంతో నమ్మి మరింత మంది అప్పులిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో పాటు స్థిరాస్తులున్నాయనే ధైర్యంతో ఎవరూ వెనకా ముందు ఆలోచించలేదు. తీరా చూస్తే సదరు వ్యక్తి నెల రోజులుగా అందుబాటులో లేకుండాపోయాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ ప్రాంతంలో పనిచేసే చోటుకు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో అప్పులిచ్చినవారు ఇంటికెళ్లి అడిగితే అతనితో తమకేం సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే కేసులైతే తమకు వచ్చే డబ్బులు రావనే భయం వారిని వెంటాడుతోంది. చేసేదేమీ లేక అతని ఆచూకీ కోసం వెతికి వేసారిపోతున్నారు. పిల్లల ఉన్నత చదువులకని కొందరు, పెళ్లిళ్లు చేయాలని ఇంకొందరు, ఇళ్లు కట్టుకుందామని మరికొందరు రూపాయి రూపాయి పోగేసుకున్నదంతా కూడగట్టి సదరు ఉపాధ్యాయుడి చేతిలో పెట్టారు. సుమారు 40 మంది వరకు బాధితులు సుమారు రూ.3 కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ నందిపేట్‌ ఎస్సై శ్రీకాంత్‌ను సంప్రదించగా ఈ మోసం తన దృష్టికి వచ్చిందని, బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని