logo

సీఎంఆర్‌ పూర్తి చేస్తారా..?

సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) సేకరణ గడువు తరుముకొస్తోంది. మార్చి 31 వరకు మిల్లింగ్‌ పూర్తి చేయాలని కేంద్రం ఇది వరకే తుది గడువు విధించింది.

Published : 29 Mar 2023 06:19 IST

ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు

 85శాతం చేరిన మిల్లింగ్‌
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) సేకరణ గడువు తరుముకొస్తోంది. మార్చి 31 వరకు మిల్లింగ్‌ పూర్తి చేయాలని కేంద్రం ఇది వరకే తుది గడువు విధించింది. నాలుగైదు నెలలుగా గడువు పొడిగిస్తున్నప్పటికీ మిల్లింగ్‌లో పెద్దగా వేగం కనిపించలేదు. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2021-22 వానాకాలం నుంచి 2022-23 వానాకాలం వరకు ఒక సీజన్‌లోనూ లక్షాన్ని చేరలేదు. 40 రోజులుగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మిల్లింగ్‌ ప్రక్రియ 85 శాతం వరకు చేరుకుంది. మిగిలిన మూడు రోజుల వ్యవధిలో 15 శాతం పూర్తి చేయాల్సి ఉంది.

గతేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి మరో 25 వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. అధికారులు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించినప్పటికీ మిల్లింగ్‌ లక్ష్యం చేరుకోలేదు. జిల్లావ్యాప్తంగా గత యాసంగి సీజన్‌లో 2.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటిని ఆయా మిల్లులకు కేటాయించారు. ఈ మేరకు 1.88 లక్షల మె.ట. బియ్యం ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటి వరకు కేవలం 1.69 లక్షల మె.ట. మాత్రమే ఇచ్చారు. మొన్నటి వానాకాలం సీజన్‌కు సంబంధించి మిల్లింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుంది.  

ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా...

కేంద్ర విధించిన గడువులోపు సీఎంఆర్‌ పూర్తి చేయడానికి మిల్లర్లు ఆపసోపాలు పడుతున్నారు. 2021-22 వానాకాలం సీజన్‌ ధాన్యం గత ఫిబ్రవరి వరకు పూర్తికాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో హమాలీల కొరత ఉందనే సాకుతో జాప్యం చేశారు. ప్రస్తుతం ఏడాది నుంచి అంతా బాగానే ఉన్నా వేగం కనిపించడంలేదు. కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, పౌరసరఫరాలశాఖ అధికారులు మిల్లర్లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి గడువులోపు సీఎంఆర్‌ పూర్తి చేయాలని ఆదేశించినా లక్ష్యం చేరుకోవడంలేదు.  


గడువులోపు పూర్తి చేయాలి

మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాల ప్రకారం సీఎంఆర్‌ను గడువులోపు పూర్తి చేయాలి. జిల్లాలో మిల్లింగ్‌ ప్రక్రియ 90శాతానికి చేరువైంది. వచ్చే మూడు రోజుల్లో శత శాతానికి చేరుకోవాలని ఆదేశించాం.  

 అభిషేక్‌, డీఎం,  పౌరసరఫరాలశాఖ, కామారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని