logo

మోగని అలారాలు..నడవని మోటార్లు

ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకొన్న భారీ అగ్నిప్రమాదాల ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని భవనాలపై కొరడా ఝలిపించాలని ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Mar 2023 06:23 IST

 అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..

 ఇదీ జిల్లాలో భవనాల దుస్థితి
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

నగరంలోని సుభాష్‌నగర్‌లో వాణిజ్య సముదాయాల యజమానులతో మాట్లాడుతున్న అధికారులు

ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకొన్న భారీ అగ్నిప్రమాదాల ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని భవనాలపై కొరడా ఝలిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక, మున్సిపల్‌ శాఖలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్‌ నగరపాలక సంస్థ, ఆర్మూర్‌, బోధన్‌ పరిధిలో 20 భవనాలను పరిశీలించిన అధికారులు పలువురు నిబంధనలు ఉల్లంఘించినట్లుతేల్చారు. త్వరలోనే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

ఇళ్లే ఆసుపత్రులుగా..

నిజామాబాద్‌, ఆర్మూర్‌లో కొందరు వైద్యులు పాత ఇళ్లను ఆసుపత్రులుగా మార్చేశారు. వాటికి పైపైన రంగులద్ది అందులోనే పడకలు ఏర్పాటు చేసి వైద్యారోగ్య శాఖ అనుమతులు పొందినా.. రోగుల రక్షణ నిమిత్తం అగ్ని నిరోధక పరికరాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల పైపైన నీటి పైపులైన్లు, అలారం బిగించి చేతులు దులుపేసుకున్నారు. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. భవనం చుట్టూర ఖాళీ స్థలం, నీటి సంపులు ఉండట్లేదు. అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకొనే మార్గం నిర్మించట్లేదు.

ఎన్నో ఉల్లంఘనలు

నగరం, పట్టాణాల్లో వేర్వేరుగా తనిఖీలు చేస్తున్న అగ్నిమాపక శాఖ, మున్సిపల్‌ అధికారులు పలు భవనాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. కనీస అగ్ని నిరోధక పరికరాలు లేవని, ఏ చిన్న ప్రమాదం జరిగినా తప్పించుకోవటం కష్టమేనని తేల్చారు. కొందరు నీటి సంపులు నిర్మించలేదు. మరికొందరు నిర్మించినా నిర్వహణ మరిచారు. మోటార్లు పాడైనా పట్టించుకోవట్లేదు. అలారం సెన్సార్లు సైతం పనిచేయట్లేదని తెలిసింది.

ఎత్తుతో సంబంధం లేదు..

అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం.. 15 మీటర్ల ఎత్తు కంటే తక్కువగా ఉన్న పాఠశాలలు, కళాశాలల భవనాలకు విధిగా ఎన్‌వోసీ అవసరం లేదు. ఆసుపత్రులు, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, గోదాంల్లో ఎత్తుతో సంబంధం లేకుండా నిబంధనలు పాటించాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని